Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్‌స్టేషన్(ఎస్డీఎస్ఎస్టీపీఎస్) లీజుపై తెలంగాణ డిస్కంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటేడ్(ఏపీసీపీడీసీఎల్)బోర్డు సమావేశం సోమవారం ఏపీ జెన్కో సీఎండీ బి శ్రీధర్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగింది. ఈ సమావేశంలో లీజు అంశంపై సీఎండీ చెప్పిన విషయాలపై తెలంగాణ డిస్కమ్‌ల అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో తమ అభిప్రాయాలను చెప్పడానికి తమకు కనీసం రెండు వారాల సమయం కావాలని కోరారు. దీంతో బోర్డు సమావేశం వాయిదా పడింది. కృష్ణపట్నం ప్లాంట్‌లో ఏపీ జెన్కోకు 51శాతం, ఏపీ ప్రభుత్వానికి 4శాతం, తెలంగాణ డిస్కంలకు 27శాతం, ఏపీ డిస్కంలకు 18శాతం భాగస్వామ్యంగా ఉన్నాయి. అంతకుముందు సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ ప్లాంట్ నిర్వహణ జెన్కోకు కష్టంగా ఉందని, నిర్వహణ ప్రయివేట్ సంస్థకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందుకోసం కన్సల్టెన్సీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై తెలంగాణ డిస్కంలు గడువును కోరాయి. ఖర్చు తగ్గించుకునే క్రమంలో సిబ్బందిని తగ్గించాలనే ప్రస్తావన కూడా చేశారు. లీజుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థకే సిబ్బందిని అప్పగిస్తే ఉద్యోగుల వేతనాల ఖర్చు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో మిగిలిన వారిని ఇతర ప్లాంట్లకు బదిలీ చేయవచ్చని తెలిపారు. ఈ కన్సల్టెన్సీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ తరహా ప్రాజెక్టులు ప్రయివేటు రంగంలో ఎలా వృద్ధి చెందాయనే అంశంపై వివరణాత్మకమైన నివేదికను ఇస్తాయి.