Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీ
- అదనపు బాధ్యతలతో పీడీ బిజీ బిజీ
- మూడేండ్లలో దిగజారిన పనితీరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పటికే నిర్వీర్యమైపోతున్నది. దేశంలోనే పనితీరులో మంచి పేరున్న ఈ సొసైటీ మూడేండ్ల కాలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా దిగాజారిపోయింది. ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలుండటం, ఆ తర్వాత స్థానాల్లో చాలా మట్టుకు ఖాళీగా ఉండటం, ఉన్న కొద్ది మంది అధికారులు ఆశ్రిత పక్షపాతం, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించడం, కార్యక్రమాల ప్రాధాన్యతలను గుర్తించడంలో విఫలం తదితర కారణాలతో టిశాక్స్ స్థానం పడిపోయింది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించటంతో పాటు, అవకతవకలకు పాల్పడి, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులను, అవినీతిపరులను ఏరివేస్తే తప్ప శాక్స్‌కు పునర్వైభవం రాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, టిశాక్స్ నిబంధనల ప్రకారం గైర్హాజరైన ఉద్యోగికి జీతం చెల్లించే అవకాశం లేకున్నా ఆర్. రఘుపతి అనే బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్‌కు నాలుగు నెలల జీతాన్ని ఇవ్వటం, అదే విధంగా ఏపీ శాక్స్ కు పంపించిన లెటరల్ షిఫ్టింగ్ లిస్ట్‌లో అతని పేరు చేర్చడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఇదంతా కూడా ఓ అధికారి ఆశ్రిత పక్షపాతంతోనే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం బ్లడ్ బ్యాంకులో పని చేస్తున్న సదరు ఉద్యోగి నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కాకున్నాపై అధికారులకు తప్పుడు సమాచారమిచ్చి లెటరల్ షిప్టింగ్ లిస్ట్‌లో అతని పేరును చేర్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నుంచి మాస్ మీడియా, ఐఈసీల ద్వారా ప్రచార కార్యక్రమాలు దాదాపు నిలిచిపోయినట్టు ఆరోపణలు న్నాయి. 2009 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్లను భర్తీ చేయకపోవడంతో ఆ సంస్థ టెక్నీషియన్లపై అదనపు భారం మోపుతున్నారు. శాక్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ), బ్లడ్ బ్యాంక్, యాంటీ రిట్రో వైరల్ థెరపీ, సెక్యువల్లీ ట్రాన్స్ మిషన్ ఇన్ఫెక్షన్ (ఎస్టీఐ) విభాగాల ద్వారా సేవలంది స్తుంటారు. ప్రజలు ఎయిడ్స్ బారిన పడకుండా నియంత్రించడం, హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు అవసరమైన మందులను సరఫరా చేయడం వీటి పని. ఆయా విభాగాలకు తీసుకున్న సిబ్బంది నుంచి వాటిల్లోనే సేవలు తీసుకోవాలని నిబంధనలను చెబుతున్నాయి. ఆ నిబంధనలు కూడా కచ్చితంగా అమలు కాకపోగా నోటిఫికేషన్‌కు భిన్నంగా ఇతర విభాగాల్లో పని చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఖాళీలు....
రాష్ట్రాన్ని ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చే ఉదాత్త లక్ష్యంతో 30 ఏండ్ల క్రితం ప్రారంభమైన టీశాక్స్ లక్ష్యానికి ఇంకా చేరుకోలేదు. నలుగురు జాయింట్ డైరెక్టర్లు, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు లేకపోవటంతో ఆ సంస్థ నామమాత్రంగా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలతో శాక్స్ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం, జిల్లా కేడర్‌కు చెందిన ఏపీడీ స్టేట్ క్యాడర్ పోస్టులో మూడేండ్లకు పైబడి ఉండటం ...ఇలా పలు కారణాలతో అది నిర్వీర్యమైపోతుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అందువల్ల టిశాక్స్ ను ప్రభుత్వమే ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు.