Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవితకాలం శిక్షపడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపైన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో శిక్షపడి జైళ్లలో ఉంటున్న ఖైదీలు శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నా విడుదలకు, క్షమాభిక్షకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం గతంలో జాతీయ పండుగలు, నాయకుల జయంతుల సందర్భంగా శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేస్తున్న ఆనవాయితీ ఉందని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన కాలం నుంచి అనేక మంది ఖైదీలు శిక్షాకాలం 15 ఏండ్ల నుంచి 20 ఏండ్లు పూర్తయినా ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యం, అనారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖైదీల బతుకు అస్తవ్యస్థమౌతున్నాయని తెలిపారు. కనీసం జీవిత చరమాంకంలోనైనా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించాల్సిన ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతాదృక్పథంతో స్పందించి శిక్షా కాలం పూరి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. జాతీయ పండుగలు, నాయకుల జయంతి సందర్భంగా విడుదల చేయాలని సూచించారు.