Authorization
Sat April 05, 2025 02:41:13 am
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
- ఎమ్సీఆర్ హెచ్ఆర్డీలో శాఖాధిపతులతో మంత్రి హరీశ్ చర్చలు
- ప్రగతి భవన్లో పద్దుకు రూపకల్పన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభా బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తగు సూచనలు చేశారు. ఈ క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలు, రంగాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించాలనే దానిపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, ముఖ్య కార్యదర్శులతో హరీశ్‌రావు సమాలోచనలు,చర్చలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)లో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ యేడాది దళిత బంధు, సాగునీటి ప్రాజెక్టులకే బడ్జెట్లో పెద్ద పీట వేయనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గ్రాంట్లు, ఆర్థిక సహాయాలు, ఇతరత్రా నిధులు కేటాయించని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయ వనరుల మీదనే ఆధారపడి పద్దును రూపొందించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటీవల రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపైన్నే సర్కారు ఎక్కువగా ఆధారపడనుంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను కూడా ఆర్థికశాఖ సేకరించింది. వీటి ఆధారంగా పద్దును రూపొందించనున్నారు. ఒకవైపు మంత్రి హరీశ్‌రావు శాఖల వారీగా సమావేశాలు జరుపుతుండగా... మరోవైపు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌కు రూపకల్పన చేసే పనిలో పడ్డారు. అయితే సంబంధిత వివరాలేవీ బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు మంచి రోజులు, తిథులు, నక్షత్రాల ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్దేశించే సీఎం కేసీఆర్... వాటి ప్రకారమే ఈనెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలకు తేదీలు నిర్ణయించారని సమాచారం. ఒకవేళ వీటిలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే ఈనెల నాలుగో వారంలో శాసనసభ, మండలిని సమావేశ పరిచి, మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం సైతం లేకపోలేదని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.