Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరా పార్కు వద్ద...
- బాధిత టీచర్లకు న్యాయం జరిగే వరకూ...
- రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా 317 జీవో జారీ
- పరస్పర బదిలీల జీవోను సవరించాల్సిందే
- సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి: యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్
నవ తెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఆరున విడుదల చేసిన 317 జీవో వల్ల నష్టపోయిన బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనే డిమాండ్‌పై బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా బాధిత టీచర్లు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, వెంకట్రావు జాదవ్, ఎస్ హరికృష్ణ, ఎన్ యాదగిరి, ఈ గాలయ్య, ఎన్ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల సర్దుబాటు కోసం విడుదల చేసిన 317 జీవోలో ఉద్యోగుల స్థానికత అంశం ప్రస్తావన లేదని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు స్థానికత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసిందని విమర్శించారు. ఉద్యోగుల అభ్యంతరాలను, అభ్యర్థనలను పట్టించుకోకుండా కేటాయించారని అన్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని వివరించారు. భవిష్యత్‌లో నాన్‌లోకల్ గోబ్యాక్ అనే నినాదంతో ఉద్యమం వచ్చే ప్రమాదముందన్నారు. స్థానికత కోల్పోయిన ఉద్యోగులను సొంత జిల్లాకు కేటాయించే వరకూ పోరాటం ఆగబోదని హెచ్చరించారు. సీనియార్టీ జాబితాలు సమగ్రంగా రూపొందించలేదని చెప్పారు. స్పెషల్ క్యాటగిరీ అభ్యర్థనలను సక్రమంగా పరిశీలించలేదని అన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ దామాషాను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారని వివరించారు. జిల్లాల కేటాయింపులో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి ఉండగా కొందరికే అవకాశమిచ్చారని చెప్పారు. ఈ కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యాయం కోసం అప్పీల్ చేసుకున్నారని గుర్తు చేశారు. నలబై రోజులు దాటినా వాటిని అధికారులు పరిష్కరించలేదన్నారు. దీంతో తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి నెలకొందని అన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు దశలవారీగా ఆందోళనలు చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యల్లేవని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బదిలీ అయినా ఉద్యోగంలో చేరని వారు ఇంకా 57 మందే ఉన్నారంటూ చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. పరస్పర బదిలీల కోసం ఇచ్చిన 21 జీవోను సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో ఉపాధ్యాయుల్లో అశాంతిని తగ్గించడం కోసమా? పెంచడం కోసమా?అని ప్రశ్నించారు. రూల్ ఐదును రద్దు చేయాలనీ, రూల్ ఎనిమిది, తొమ్మిదిని సవరించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోనే పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీని కోల్పోకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలనీ, 317 జీవో వల్ల నష్టపోయిన బాధిత టీచర్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
యూఎస్పీసీ డిమాండ్లు
- స్థానికత అంశాన్ని చేరుస్తూ 2021, డిసెంబర్ ఆరున జీఏడీ విడుదల చేసిన 317 జీవో మార్గదర్శకాలను సవరించాలి.
- జిల్లాల కేటాయింపులో స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను ఆప్షన్ ప్రకారం వారి స్వంత జిల్లాలకు తిరిగి కేటాయించాలి.
- సీనియార్టీ జాబితాలు, జిల్లాల కేటాయింపులో జరిగిన పొరపాట్లపై ఉపాధ్యాయులు పెట్టుకున్న అప్పీళ్లను సత్వరమే పరిష్కరించాలి. (స్పెషల్ కేటగిరీ అప్పీళ్లను పరిష్కరించాలి)త
- వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు జిల్లాల కేటాయింపులో తగిన ప్రాధాన్యతనివ్వాలి.
- ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను దామాషా పేరుతో ఆప్షన్లకు భిన్నంగా చేసిన జిల్లాల కేటాయింపును రద్దు చేయాలి.
- స్పౌజ్ కేటగిరీ అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి.
- హోల్డ్‌లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్ అప్పీళ్లను ఖాళీల మేరకు అనుమతించాలి.
- మొదటి జాబితాలో మిస్ అయిన 19 జిల్లాల స్పౌజ్ అప్పీళ్లతో రెండో జాబితా విడుదల చేయాలి.
- కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల స్పౌజ్లనూ పరిగణనలోకి తీసుకోవాలి.
- మల్టీజోన్-1, మల్టీజోన్-2లలో ఆప్షన్‌కు భిన్నంగా వేరొక మల్టీజోన్కు కేటాయించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను వారి స్వంత జోన్లలోనే కొనసాగించాలి.
- ఇంటర్ లోకల్ క్యాడర్ పరస్పర (మ్యూచువల్) బదిలీలకు అనుమతినిస్తూ విడుదల చేసిన 21 జీవోలోని రూల్ ఐదును తొలగించాలి. రూల్ ఎనిమిది, తొమ్మిదిలను సవరించాలి. ఉమ్మడి జిల్లాలో నియామకమైన ఉపాధ్యాయుల సీనియార్టీకి రక్షణ కల్పించాలి.
- ఐఎఫ్‌ఎంఐఎస్‌లో టైపోగ్రాఫికల్ సమస్య వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
- తక్షణమే అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, పదోన్నతుల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించాలి.