Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రయివేటీకరిస్తారా...? :కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి కేటీఆర్ లేఖ
- సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించిన మోడీ సర్కార్... తెలం గాణలోని సింగరేణిని మాత్రం ప్రయివేటీకరించేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నదని తెలిపారు. జేబీఆర్వోసీ-3, కేకే-6, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం గనులను సింగరేణికి కేటాయించకుండా... వాటికోసం వేలంలో పాల్గొనాలంటూ నిర్దేశించటమేంటని ప్రశ్నించారు. అంటే గుజరాత్‌కు ఒక న్యాయం..? తెలంగాణకు మరో న్యాయమా...? అని ప్రశ్నించారు. ఆ సంస్థకే నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీకి కేటీఆర్ సోమవారం లేఖ రాశారు.
తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రయివేటీకరణకు కేంద్రం శరవేగంగా పావులు కదుపుతున్నదని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ సంస్థను బలహీనపరచటం ద్వారా దానికి నష్టాలొస్తున్నాయని చూపటం కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆ సాకుతో సింగరేణి ప్రయివేటీకరణకు తెరతీయనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే వారసత్వ ఉద్యోగాలు ఉండబోవనీ, గనులు మూతపడితే సిబ్బంది, కార్మికులను తొలగిస్తారని హెచ్చరించారు. ఇప్పుడు వారు పొందుతున్న హక్కులు, లాభాల్లో వాటాలు తదితరాంశాలన్నీ పక్కకుపోతాయని వివరించారు. అంతిమంగా సింగరేణి కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టువంటివని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కూడా కేంద్రం ఇదే రకమైన వైఖరిని అనుసరించిందని పేర్కొన్నారు. ఆ సంస్థకు ఐరన్ ఓర్ గనులను కేటాయించకుండా నష్టాలకు గురి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలనీ, తద్వారా ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కేటీఆర్... కేంద్ర మంత్రిని కోరారు. లేదంటే సంస్థను కాపాడుకోవటానికి టీఆర్ఎస్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. అవసరమైతే ఉద్యమాలకు సైతం వెనుకాడబోమని లేఖలో పేర్కొన్నారు.