Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాని రక్షించుకునేందుకు ఉధృత పోరాటాలు :ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్
- కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్
- 23 అంశాలపై తీర్మానాలు
- ముగిసిన జాతీయ కౌన్సిల్ సమావేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా మిషన్ 2024 రూపొందించామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ వెల్లడించారు. ప్రజలను, దేశాన్ని రక్షించుకునేందుకు ఉధృత పోరాటాలు నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాసేలా నాలుగు కార్మిక కోడ్లు తీసుకొచ్చి ఆ వర్గానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. మూడు రోజులతోపాటు హైదరాబాద్‌లోని కాచిగూడలో కొనసాగిన ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో మొత్తం 23 అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శులు బివి విజయలక్ష్మి, మోహన్‌శర్మ, సుకుమార్ దామ్లే, బబ్లీ రావత్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాల్‌రాజ్, కార్యనిర్వాహక అధ్యక్షులు యండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శులు మొట్టె నర్సింహ్మా, బి వెంకటేశంతో కలిసి అమర్ జీత్ కౌర్ విలేకర్లతో మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని అమ్మేసేలా ఉన్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకే పోరు సాగిస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు శ్రామికవర్గం, అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ సర్కారు తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ, 'ప్రజలను కాపాడండి, దేశాన్ని కాపాడండి' అనే నినాదందో మార్చి 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలిచి పోరు సాగించిందనీ, నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం, జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో మౌలిక వసతులను కల్పించే రంగాలను అమ్మకానికి పెట్టడమంటే దేశ సంపదను దోచిపెట్టడమేనన్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ ఆర్థిక విధానాలను నరేంద్ర మోడీ మరింత వేగవంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను లేకుండా చేసేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదనీ, పార్లమెంటులో ఆనాటి జనసంఫ్‌ు ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగకూడదన్న మాట నిజంకాదా? అని నిలదీశారు. బ్యాంకుల జాతీయీకరణను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో సార్వత్రిక సమ్మెను నిర్వహించి మోడీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మతోన్మాదం బుసలుకొడుతున్నదనీ, మైనార్టీలపై దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం 8.1శాతం పెరిగిందనీ, దేశంలో 50శాతం యువత 29, 30ఏండ్ల వయస్సులోపు వారే ఉన్నారని పేర్కొన్నారు. వారంత ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. విద్యార్థులు యువకులు, మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలను జాతులుగా విభజిస్తున్నారని విమర్శించారు. ద్వారా రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదన్నారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించారనీ, అదే మోడీ ప్రధాని కాగానే పెద్దనోట్ల రద్దు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో విద్యా, వైద్యం, మంచినీరు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు నిధుల్లో కోత విధించారని విమర్శించారు. ఎయిర్ ఇండియాను అమ్మేసి బీఎస్ఎన్ఎల్ను ధ్వంసం చేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.బీజేపీ హయాంలో ప్రజాస్వా మ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. 4.90కోట్ల మంది చిన్నారులు బాలకార్మికులుగా పనిచేస్తున్నారంటే, మోడీ పాలన ఏ విధంగా ఉందో అర్ధమవుతున్నదన్నారు. 42 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించివేస్తున్నదని విమర్శించారు. ఈయేడాది డిసెంబర్లో కేరళ రాష్ట్రంలో ఏఐటీయూసీ42వ జాతీయ మహాసభలు నాలుగు రోజులపాటు నిర్వహిస్తామనీ, త్వరలో ఆయా తేదీలను ఖరారు చేస్తామని అమర్జిత్కౌర్ ఈ సందర్భంగా తెలిపారు.