Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాధ్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 80 ఏండ్లు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి మండలం లో ఆయన జన్మించారు. మునిపల్లెలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి కాకినాడలో ఉన్నత విద్యను చదివారు. వామపక్ష రాజకీయాల ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన ఆయన ఉదయం, వార్త, ఆంధ్రప్రభలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏపీ టైమ్స్ ఆంగ్ల దినపత్రికకు హైదరాబాద్ బ్యూరోచీఫ్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడైన నిమ్మకాయల వంశీ ప్రస్తుతం దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంగనాథ్ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయని శ్రీరంగనాధ్ కుటుంబ్ణసభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల పలువురు అధికార, అనధికార ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..
టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
సీనియర్ జర్నలిస్టు శ్రీరంగనాధ్ గుండెపోటుతో మరణించడం బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య తెలిపారు. ప్రజల కోణంలో వార్తలు రాయడంలో శ్రీరంగనాత్ దిట్ట అని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.