Authorization
Sat April 05, 2025 11:21:41 am
- రజకుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం తగదు
- సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో రజక వృత్తిదారుల సంక్షేమం కోసం రూ. 2,500కోట్లు కేటాయించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య తీర్మాన పత్రాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న సేవావృత్తుల్లో రజక వృత్తి అత్యంత ముఖ్యమైనదన్నారు. మారుతున్న సమాజంలో వృత్తిలో కూడా కొత్త పోకడలు వస్తున్నాయని గుర్తుచేశారు. లాండ్రీ, వాషింగ్, ఐరన్ తదితర పనుల్లో ఆధునికత వస్తున్నదన్నారు. అయితే ఈ వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించటంతో వృత్తిదారుల ఉపాధి దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాలుగా వృత్తినే నమ్ముకుని బతుకుతున్నవారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని చెప్పారు. వృత్తిలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రభుత్వం వారికి తగిన సదుపాయాలను కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పాత పద్దతిలో వృత్తిని నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని గుర్తుచేశారు. వృత్తిదారులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధునాతన దోభీఘాట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టీ-4లోకి మార్చాలన్నారు. ప్రభుత్వ దవాఖానాలు, విద్యా సంస్థలు, పోలీసు శాఖల్లోని బట్టలుతకటం, ఇస్త్రీ చేయటం లాంటి పనులను రజక వృత్తిదారులకే ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చట్టం మాదిరిగా రక్షణ చట్టం చేయాలంటూ సంఘం రూపొందించిన 16 డిమాండ్ల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఈ డిమాండ్ల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో అధునాతన దోబీఘాట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో రజక సహకార సంఘాలన్నింటికీ రూ:30 లక్షల రుణాలు అందించాలని కోరారు. చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యం.వి.రమణ మాట్లాడుతూ రజక ఫెఢరేషన్కు పాలక వర్గాన్ని ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో బట్టలు శుభ్రం చేసే పనులు రజక వృత్తిదారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రజకసంఘాల రాష్ట్ర నాయకులు సి.శంకర్, ఆలిండియా దోభీ మహా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లగ్డాపురం నర్సింహులు, రజక రిజర్వేషన్ల సమితి యూత్ అధ్యక్షులు చాపర్తి కూమారు గాడ్గే, రజక రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షులు, చాకలి ఐలమ్మ విజ్ఞాన కేంద్రం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అవనగ సైదులు, సట్ల అంజలి యం.బాలకష్ణ, సి.మల్లేశం, నీలం వెంకన్న, చెన్నారపు మల్లేశం, పి.శోభ, సి.వెంకటస్వామి, పల్లపు విగేష్ తదితరులు పాల్గొన్నారు