Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన రూ. 50వేల కోట్ల విలువైన మణికొండ దర్గా వక్ఫ్ భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, ఆ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం మైనార్టీల అభివద్ధికి వినియోగించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ జాగీర్‌లోని హజ్రత్ సయ్యద్ హుస్సేన్ షా వలీ దర్గాకు చెందిన 1654 ఎకరాల, 32 గుంటల భూమికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుపై రాష్ట్రప్రభుత్వం గెలిచిందని తెలిపారు. వక్ఫ్ పాలకమండలి అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా రూ.50 వేల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను సంబంధిత బోర్డు కోల్పోయిందని పేర్కొన్నారు. వక్ఫ్ పాలకమండలి చైర్మెన్‌ను, సభ్యులుగా సమర్దులైన వారిని నియమించడంలోనూ పాలక మండలిని సరిగా పని చేయించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రూ. 50 వేల కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు భూములు, ప్రభుత్వ భూములుగా మారిపోయాయని తెలిపారు. ఇది ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప మరేమీ కాదని పేర్కొన్నారు. వక్ఫ్ భూములను గుర్తించాల్సింది, వాటి రికార్డులను నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. వక్ఫ్ బోర్డు అవినీతి, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి, మణికొండ దర్గా వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డుకు అప్ప గించాలని కోరారు. ఆక్రమణలకు గురవుతున్న వక్ఫ్ ఆస్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.