Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ ఆరు పేపర్లే
- 70 శాతం సిలబస్‌తోనే నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మే ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నది. ఏప్రిల్ 20 నుంచి మే ఐదో తేదీ వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. దీంతో మే ఆరో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను ప్రారంభించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్‌ను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. ఇంటర్ పరీక్షలన్నీ మే పదో తేదీ వరకు జరుగుతాయి. అందుకనుగుణంగా మే 11 నుంచి పదో తతరగతి పరీక్షలను ప్రారంభించాలని మరో షెడ్యూల్‌నూ రూపొందించింది. వీటిలో ప్రభుత్వం ఆమోదించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశమున్నది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరంలోనూ ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లే రాయాల్సి ఉంటుంది. 2019-20 విద్యాసంవత్సరం వరకు పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఆరు సబ్జెక్టులను 11 పేపర్లకు నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు, వారిపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా 11 నుంచి ఆరు పేపర్లకు ప్రభుత్వం కుదించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికీ ఆ నిబంధనను వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థులకు 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ఫీజు చెల్లింపు గడువు ఈనెల 14వ తేదీ వరకు ఉన్నది. ఆలస్య రుసుం రూ.50తో ఈనెల 24 వరకు, రూ.200తో మార్చి నాలుగు వరకు, రూ.500తో 14వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమున్నది.