Authorization
Sat April 05, 2025 01:38:06 pm
- స్టోర్ కార్మికులను రెగ్యులర్ చేయాలి : టీఎస్ఈఎస్డబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లా స్టోర్లలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్(టీఎస్ఈఎస్డబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తుల యాదయ్య, పాలడుగు సుధాకర్, కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు చీఫ్‌మేనేజర్ ప్రభాకర్‌కు వినతిపత్రాన్ని టీఎస్ఈఎస్డబ్ల్యూయూ బృందం అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా అన్ని పవర్ డిస్కామ్‌లలో 20 ఏండ్ల నుంచి 220 మందికిపైగా విద్యుత్ స్టోర్ కార్మికులు లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్ పరికరాలు స్టోర్ల నుంచి వెళ్లేలా చేయడంలో వారిదే కీలక పాత్ర అన్నారు. వారికి ఆరేండ్లుగా పీస్ రేట్లను పెంచలేదనీ, పైగా ఎన్పీడీసీఎల్లో ఉన్నరేట్లనూ తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలనీ, పీఎఫ్, ఈఎస్ఐను అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలనీ, వారిని ఆర్టిజెన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆలోగా ఎన్పీడీసీఎల్లోనూ ఎస్పీడీసీఎల్లో మాదిరిగానే ఎస్ఎస్ రేట్లను అమలు చేయాలని కోరారు. పనిప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ స్టోర్ కార్యదర్శి ఉపేందర్, క్రాంతికుమార్, విద్యాసాగర్ (నిజామాబాద్ స్టోర్), సత్యనారాయణరెడ్డి(కరీంనగర్స్టోర్), సుధాకర్, సురేందర్(మంచిర్యాలస్టోర్), నాగేశ్వర్రావు, విజరు(వరంగల్స్టోర్), తదితరులు పాల్గొన్నారు.