Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- మేజర్ పురపాలికల్లోనూ నాలా సేఫ్టీ ఆడిట్
- ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ప్రభుత్వం ప్రతిసారీ అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి... ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాలాలకు సంబంధించి ఫెన్సింగ్, ఇతర రక్షణ కార్యక్రమాలకు సరిపోయినంత సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిచేయాలి.. ఒకవేళ భవిష్యత్తులో నాలాలపై అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తాం' అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలపై మంత్రి తారకరామారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలం నాటికి నాలాలకు సంబంధించిన రక్షణ చర్యలను, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. నాలాలకు సంబంధించిన విషయంలో నాలా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఈ కార్యక్రమం తర్వాత ఎక్కడెక్కడ నాలాల బలోపేతం, అభివృద్ధికి సంబంధించిన పనులు అవసరమో గుర్తించి, పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిసారీ అనేక చర్యలు తీసుకున్నా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, ఈసారి అలాంటివి జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జోనల్ కమిషనర్ నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ నాలాలపై ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. నాలాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ప్రతివారం సమీక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్కి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మేయర్ నగర వ్యాప్తంగా పర్యటించి ఈ పనులను పర్యవేక్షించాలని సూచించారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని కాకుండా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పురపాలికల్లో కూడా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సీడీఎంఏ సత్యనారాయణకు సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి మేజర్ కార్పొరేషన్లలోనూ నాలాలపై రక్షణ చర్యలు తీసుకునేలా ఒక కార్యాచరణ చేపట్టాలన్నారు.