Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
- నేషనల్ స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ బీవీ విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి మూడో తేదీని దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని నేషనల్ స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జాతీయ కన్వీనర్ డాక్టర్ బీవీ.విజయలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను శ్రామిక మహిళలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ, వారికి కనీస వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో నేషనల్ స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సు జరిగింది. దీనికి ఆల్ ఇండియా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంగళ్ పాండే, ఆల్ ఇండియా మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కాళే, ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జయమ్మ, శ్రామిక మహిళా ఫోరం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రేంపావని అధ్యక్షవర్గంగా వ్యవహరించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలోనూ ఆశావర్కర్లకు పాలకులు పారితోషికాలు కాదుకదా కనీసం పీపీఈ కిట్లను కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగ విరమణ చేసిన శ్రామిక వర్కర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లకు రూ. 2లక్షలు ఇవ్వాలని కోరారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతేడాది కంటే నిధులు తగ్గించడం దారుణమని విమర్శించారు. శ్రామిక మహిళలకు సెలవులివ్వడంలేదనీ, పనిప్రదేశాల్లో వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగ, వేతన, సామాజిక భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ పేదల పట్ల ప్రభుత్వాలు అత్యంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాయని, సంక్షేమ పథకాలను ఒక బాధ్యతగా భావించడం లేదని విమర్శించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మిడ్ డే మీల్స్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేస్తున్నదని చెప్పారు.ఆ రాష్ట్రానికి సాధ్యమైనప్పుడు మిగతావాటికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం రోడ్లపైకొచ్చి పోరాటం చేస్తేనే న్యాయం దక్కుతుందన్నారు. మహిళలు చేస్తున్న పనులకు ఇంటా, బయట విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళలు రాజకీయ చైతన్యాన్ని పెంచుకోకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.