Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలతో కేంద్రం మెడలు వంచాలి
- మార్చి 28, 29 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ
నవతెలంగాణ-కంఠేశ్వర్
'స్వాతంత్య్రానంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ మౌలిక వసతులు, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించే విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ పిలుపునిచ్చారు. ఎన్నో త్యాగాలు, రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లుగా చేసి.. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోదపించారు. వీటికి వ్యతిరేకంగా మార్చి 28, 29 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై కార్మికులు, రైతులు సమైక్యంగా పోరాడుతున్నారన్నా రు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి సామాన్య ప్రజల బతుకులు దుర్భరంగడా మారినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి తీవ్రంగా దెబ్బతిని, ఆదాయాలు కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలని ఐక్య కార్మికోద్యమ డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో దేశ రైతాంగం సమరశీలంగా పోరాడి, మోదీ సర్కార్ మెడలు వంచిందని గుర్తుచేశారు. ఆ పోరాట స్ఫూర్తితో నేడు కార్మికవర్గం మరింత ఉధృతంగా మార్చి 28,29 తేదీల్లో 2 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రామ్మోహన్ రావు, నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, స్వర్ణ, శంకర్ గౌడ్, సూరి, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.