Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికుల విజయోత్సవ సభలో..యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు
నవతెలంగాణ-కంఠేశ్వర్
తమ ఉద్యోగం పర్మినెంట్ కోసం మున్సిపల్ కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. పోరాడి వేతనాలు సాధించుకున్న మున్సిపల్ కార్మికుల విజయోత్సవ సభను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామ్‌దేవ్‌వాడ సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ గౌరవాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సభకు పాలడుగు భాస్కర్ హాజరై మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల ఐక్య పోరాట ఫలితంగానే వేతనాలు పెరిగాయని, ఇది కార్మికుల విజయమని అన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపులో, జీవో 4ను ప్రభుత్వం వెంటపడి తీసుకురావడంలో సీఐటీయూ కృషి ఫలితమేనని తెలిపారు. కార్మికులు, సీఐటీ యూ కృషిని గుర్తించి అధిక సంఖ్యలో యూనియన్‌లో చేరుతున్నట్టు తెలిపారు. ఏండ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు కోసం.. మున్సిపల్ కార్మికులు భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కార్మికులు పాలడుగు భాస్కర్‌తో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వి రమ, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సూర రవి, సంతోష్ సింగ్, వెంకటేష్, సంతోష్ గౌడ్, అంజయ్య, శంకర్, రాకేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.