Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జానకి పుష్పనాథ్
- వచ్చేఏడాది జూన్ నాటికి కొత్త విద్యాప్రణాళిక : లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందించాలని బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జానకి పుష్పనాథ్ అన్నారు. ఈ ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో ఉన్నత విద్యామండలి అనూహ్య పురోగతి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం ఉన్నత విద్యామండలి, బ్రిటీష్ కౌన్సిల్ మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పనుల పురోగతిని మంగళవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జానకి పుష్పనాథ్ మాట్లాడుతూ కోవిడ్ కాలంలోనూ ఉన్నత విద్యా సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. దీనివల్ల మూడేండ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు ఎనిమిది వేల మంది ప్రయోజనం పొందుతారని వివరించారు. ఉన్నత విద్యలో లోతైన విషయ పరిజ్ఞానం, ప్రపంచస్థాయి నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఉపాధి అవకాశాలు పెంచేలా డిగ్రీ పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉన్నత విద్య బలోపేతం కోసం 2018లో బ్రిటీష్ కౌన్సిల్, ఉన్నత విద్యామండలి మధ్య అవగాహన ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూకేకు చెందిన బంగోర్, అబ్యరిస్విత్ విశ్వవిద్యాలయాలు, తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల మధ్య 2020, మార్చిలో విద్యా ప్రాజెక్టుల రూపకల్పనపై ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ భాగస్వామ్య విశ్వవిద్యాలయాల సహకారంతో 2023, జూన్ నాటికి ఆశించిన కొత్త విద్యా ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన పాఠ్యప్రణాళికలో గుర్తించిన అంశాలపై చర్చించామని వివరించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఓయూ వీసీ డి రవీందర్, కేయూ వీసీ టి రమేష్, బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా ఉన్నత విద్యా డైరెక్టర్ సోను తదితరులు పాల్గొన్నారు.