Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హయాత్‌నగర్
కేంద్ర బడ్జెట్లో చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ సహారాలోని చెరుపల్లి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా వ్యాపారస్తులకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసేలా ఉందన్నారు. వార్షిక బడ్జెట్లో ప్రధాన ఉపాధి రంగమైన చేనేతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమంటే ఆ రంగానికి, దానిపై ఆధారపడిన వారికి అన్యాయం చేసినట్టేనని చెప్పారు. కరోనా వల్ల చేనేత వృత్తి పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. కార్మికులు ఉపయోగించే నూలు, రంగులు తదితర ముడి సరుకులపై 5 శాతం జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతుంటే.. దాన్ని 12 శాతానికి పెంచేందుకు యత్నించిందని విమర్శించారు. ముడిసరుకుల రేట్లు పెరగడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి కరువై.. ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. గతేడాది కరోనా సంక్షోభంలో ఉద్దీపన, ఉద్యోగ కల్పన, చిన్న పరిశ్రమల స్థాపన కోసమని రూ. 20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించినా ప్రయోజనం శూన్యమన్నారు. చేనేత కార్మికులు వినియోగించే ముడి సరుకులపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. చేనేత రంగం నుంచి టెక్స్‌టైల్స్‌ను విడదీసి బడ్జెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.సహకార సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి, వాటిని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, ప్రధాన కార్యదర్శి బడుగు శంకరయ్య, గౌరవ అధ్యక్షులు కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.