Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకులను మార్చితేనేే ప్రజలకు మేలు
- ప్రజల్లో చిచ్చురేపుతున్న మోడీ.. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు అనర్హులు
- విలేకర్ల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -మిర్యాలగూడ
రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు మేలు చేకూర్చే విధంగా రాజ్యాంగం రచించారని, కానీ పాలకులు దానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రతి మనిషికీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఉచిత విద్య వైద్యం అందించాలన్న లక్ష్యం రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. కానీ, పాలకులు వాటిని అమలు చేయకుండా ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు. దేశ ప్రజల మేలు కోసం మంచి విషయాలు పొందుపర్చాలనుకున్నప్పుడు కొన్ని లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజ్యాంగాన్నే మార్చాలనుకోవడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, ఎన్నికల వ్యవస్థలో, చట్టసభల్లో పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత ఆదాయం, భూములపై అంశాలపై మార్పు తీసుకురావడానికి రాజ్యాంగం చూపిన మార్గాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 'ముఖం బాగోలేక అద్దం పగల కొట్టినటు'్ట అన్న చందంగా సీఎం కేసీఆర్ తీరు ఉందన్నారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో అందరికీ ఉపాధి నిరుద్యోగ భృతి, ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని ఎందుకు సరిగా అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతులై పాలకులను మార్చాలని కోరారు. అప్పుడే పట్టిపీడిస్తున్న సమస్యలు పరిష్కార మవుతాయన్నారు. ప్రజల్లో చిచ్చు రేపుతున్న ప్రధాని మోడీ.. ప్రజలను ఐక్యతపరిచిన సమతా మూర్తి విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఒక్కతాటిపై వచ్చి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవి నాయక్, భవాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, పతని శ్రీనివాస్, రామారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.