Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం యాజమాన్యం నానా తంటాలు పడుతున్నది. ప్రజలకు సంస్థపై విశ్వాసం కలిగించాలనే తాపత్రయంలో వాస్తవాలను దాచి, అతిశయోక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఈ తరహా అత్యుత్సాహ ప్రకటనలు జారీ అయ్యాయి. పలు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయోచ్చంటూ ప్రకటనలు చేశారు. ఈ విషయాన్ని పరీక్షలు ప్రారంభమయ్యే రోజున, సమయం ముగిసాక టీవీల్లో స్క్రోలింగ్స్ ఇప్పించి, అభాసుపాలయ్యారు. టైం అయిపోయాక ఈ ప్రకటన చేసి ప్రయోజనం ఏంటని అనేకమంది ఆర్టీసీ నిర్వాకంపై విమర్శలు చేశారు. తాజాగా ఆర్టీసీ ఎమ్డీ సంస్థలోని 40వేల మంది ఉద్యోగులు, సిబ్బందితో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారని ప్రకటన చేశారు. అంటే...ఎమ్డీ జూమ్ మీటింగ్ టైంలో ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడ నిలిపేసి, ఉద్యోగులు దానిలో పాల్గొన్నారా అనే సందేహం కలగడం సహజం. ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు దాదాపు 47వేల మంది. వీరిలో దాదాపు 30 శాతం మంది (దాదాపు 13వేల మంది) ఉద్యోగులు స్పేర్, సెలవులు, రెస్ట్, సిక్ లీవుల్లో ఉంటారు. ఉదయం 8 గంటలకు దాదాపు 7 వేల షెడ్యూల్డ్ బస్సులు రోడ్లపైకి వస్తాయి. అంటే దాదాపు 14వేల మంది సిబ్బంది బస్సుల్లో డ్యూటీల్లో ఉన్నారు. వీరు కాకుండా సాయంత్రం డ్యూటీలు ఉన్నవారు మరికొంత మంది ఉంటారు. అలాంటప్పుడు 40వేల మంది ఉద్యోగులు ఈ మీటింగ్కు ఎలా హాజరయ్యారనేది కార్మిక సంఘాల ప్రశ్న. దాదాపు 33 నిముషాలపాటు జరిగిన జూమ్ మీటింగ్లో మొదటి 10 నిముషాలు ఆర్టీసీ ఉన్నతాధికారి మునిశేఖర్ మాట్లాడారు. ఆ తర్వాతి 23 నిముషాలు ఎమ్డీ మాట్లాడారు. దానిలోనూ మేడారం జాతర అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగుల నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారని మరో అభూత కల్పనను సృష్టించారు. అసలు ఈ సమావేశంలో ఏ ఒక్కరి నుంచీ ఎలాంటి సలహాలు స్వీకరించలేదు. ఓ డిపోలో మహిళా ఉద్యోగి ఒకరు తమ సాదకబాదకాలు చెప్పుకుంటామని ముందుకొస్తే, ఆమెకు అవకాశం ఇవ్వలేదని తెలిసింది. అదే ప్రకటనలో సీసీఎస్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ చెల్లింపులను పెండింగ్లో ఉంచట్లేదనీ చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయని కార్మిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ''సంస్థ అభివృద్ధికి కార్యరూపంలో ఉండే ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తే సంతోషం. ఇలాంటి అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేస్తే సంస్థపై ప్రజలకు, ఉద్యోగులకు నమ్మకం సన్నగిల్లుతుంది'' అని ఓ కార్మిక సంఘం నాయకుడు వ్యాఖ్యానించారు.