Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్డీ ఉద్భోధ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులు విధి నిర్వహణలో ఒత్తిడిని జయించి, సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేయాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పారు. మంగళవారంనాడాయన బస్‌భవన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా సంస్థలోని 40వేల మంది ఉద్యోగులు, అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తూ, వారి నుంచి విలువైన సలహాలు, సూచనలను స్వీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణను భారంగా భావించకూడదనీ, అంకితభావం, చిత్తశుద్ధితో విధుల్ని నిర్వర్తించినప్పుడే సంస్థలో ప్రత్యేక స్థానం లభిస్తుందన్నారు. సిబ్బంది, ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఒకటవ తేదీనే జీతాలు వస్తుండటంతో ఉద్యోగుల్లో అభద్రతాభావం తొలగిపోయిందనీ, సీసీఎస్ బకాయిలనూ పూర్తిస్థాయిలో చెల్లించడం జరుగుతోందని చెప్పారు. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ చెల్లింపులను పెండింగ్ ఉంచట్లేదనీ, అవసరమైన మేర దశల వారీగా సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. మహిళా ఉద్యోగినుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి సూచనలు, సలహాలను పరిశీలించి ఇబ్బందులను పరిష్కరిస్తామని తెలిపారు. సంస్థ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ ఐకాయిలు త్వరలో చెల్లిస్తామన్నారు. సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ తరహాలో ఆధునీకరించడం జరుగుతుందనీ, 4 నెలల్లో ఐసీయూ, డయాలసిస్, అత్యవసర విభాగాలను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు 24/7 మందుల సరఫరా సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. మేడారం జాతర విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలనీ, మాస్కులు ధరించడం, తరచుగా శానిటైజ్ చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరచిపోవద్దని సూచించారు. మేడారం మార్గమధ్యంలో చిన్న చిన్న కారణాలతో ఆపి ట్రాఫిక్ జామ్‌లు, ఇతర సమస్యలకు అవకాశం ఇవ్వొద్దన్నారు. జూమ్ మీటింగ్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటు, ఆయా రీజినల్ మేనేజర్లు, డివిజనల్, డిపో మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొని ఎమ్డీ సూచనల్ని ఆలకించారని ఆ ప్రకటనలో తెలిపారు.