Authorization
Tue April 08, 2025 02:09:02 am
- భారీగా హాజరుకానున్న '317 జీవో' బాధిత టీచర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఆరున విడుదల చేసిన 317 జీవో వల్ల నష్టపోయిన బాధిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. వివిధ జిల్లాల నుంచి బాధిత ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఈ ధర్నాకు హాజరయ్యే అవకాశమున్నది. 317 జీవోను సవరించి స్థానికతను చేర్చాలనీ, సీనియార్టీలో తప్పులు, అప్పీళ్లను పరిష్కరించాలనీ, స్పౌజ్, ఒంటరి, వితంతు మహిళలతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వారికి ప్రాధాన్యతనివ్వాలని యూఎస్పీసీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల్లోనూ స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు కోరింది. భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ దామాషాను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారనీ, జిల్లాల కేటాయింపులో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయనీ, వాటిని సరిదిద్దాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల స్పౌజ్లనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇంటర్ లోకల్ క్యాడర్ పరస్పర (మ్యూచువల్) బదిలీలకు అనుమతినిస్తూ విడుదల చేసిన 21 జీవోలోని రూల్ ఐదును తొలగించాలనీ, రూల్ ఎనిమిది, తొమ్మిదిలను సవరించాలని కోరింది. ఉమ్మడి జిల్లాలోనే పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీని కోల్పోకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.