Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్నాళ్ల పాటు కొత్త వేరియంట్ కు అవకాశం లేదు
- రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత
- అయినా...ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..: డీహెచ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా మూడో దశ ముగిసినట్టేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హైదరా బాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 23న మూడో దశ ఉధృతి బాగా పెరిగిందనీ, పాజిటివిటీ రేటు అత్యధికంగా ఐదు శాతానికి వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం అది రెండు శాతం కంటే తక్కువగా నమోదవుతుందని వెల్లడించారు. కోవిడ్ మొదటి దశతో 10 నెలలు, రెండో దశతో ఆరు నెలలు ఇబ్బంది పడితే మూడో దశలో 28 రోజులు ఎక్కువ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఫీవర్ సర్వేలో భాగంగా నాలుగు లక్షల మందికి ఇచ్చిన కిట్లు, వ్యాక్సినేషన్ మంచి ఫలితాలనిచ్చాయని చెప్పారు. మూడో దశను రెండు నెలల్లోనే అదుపులోకి అదుపులోకి తేగలిగామనీ, ఈ దశలో టీకా తీసుకోని 2.8 శాతం మంది ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోద్యయాయనీ, కేవలం మూడు వేల మంది రోగులు మాత్రమే ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు లేనందున అన్ని సంస్థలు వంద శాతం పని చేయొచ్చనీ, ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చని వివరించారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్ ఫ్రం హౌం తీసి వేయొచ్చని సూచించారు. ఆన్ లైన్ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనీ, అందుకే విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించినట్టు తెలిపారు. మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్ కలిగిన ఆస్పత్రిని సిద్ధం చేశామనీ, అవసరమైన పరీక్షలు అక్కడే చేస్తామని స్పష్టం చేశారు.
త్వరలో కొన్ని ప్రాంతాలకు పరిమితం
త్వరలో కోవిడ్ కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఎండమిక్ స్థాయికి పడిపోతుందని శ్రీనివాసరావు చెప్పారు. రాబోయే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్ పుట్టే అవకాశం లేదనీ, భవిష్యత్తులో సాధారణ ఫ్లూ మాదిరిగా కోవిడ్ మారుతుందని చెప్పారు.