Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు నెలలయినా మారని చెక్కులు
- ఆర్థిక ఇబ్బందుల్లో సర్పంచులు, మల్టీ పర్పస్ వర్కర్లు
నవతెలంగాణ - బోనకల్
పంచాయతీ చెక్కులు మారటానికి నాలుగైదు నెలలు పడుతుండటంతో సర్పంచులు, మల్టీపర్పస్ వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రెజరీలో చెక్కులు వేస్తే ఐదు నెలల దాకా మారే పరిస్థితి లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో పరిపాలన, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. మంచినీటి సరఫరా, వీధిలైట్లు, పారిశుధ్య పనులు తదితర రోజువారీ పనుల బిల్లుల చెక్కులకూ నాలుగైదు నెలల సమయం పడుతుందని అంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల నిధుల్లోనూ కోత విధిస్తూ, పంచాయతీల నుంచి బలవంతంగా లాక్కోవడం పంచాయతీలను నిర్వీర్యం చేయడంలో భాగమేనని సర్పంచులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీలో 8 నుంచి 12 మంది వరకు మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. వీరందరికీ పంచాయతీ నిధుల నుంచి జీతాలు చెల్లించవలసి ఉంది. వీరి జీతాలకు సంబంధించిన చెక్కులు తీసుకెళ్తే ట్రెజరీ నుంచి కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతోంది. మల్టీపర్పస్ వర్కర్లకు ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయవలసిన పాలకులు, రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను కూడా ఇవ్వకపోవటంతో అభివృద్ధి కుంటుపడుతుందని సర్పంచులు అంటున్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీల్లో చేసిన పనులకూ ఏండ్ల తరబడి ఎంబీ రికార్డు చేయకపోవడంతో సర్పంచులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒకవేళ ఎంబీ రికార్డు చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి అభివృద్ధి పనులు చేయటం వల్ల నిధులు విడుదల కాకపోవడంతో వడ్డీలు చెల్లించటానికి మరిన్ని అప్పులు చేయవలసిన పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి తమను అప్పుల భారం నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని సర్పంచులు కోరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం ఆర్థికంగా సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులను ఆగమేఘాల మీద అప్పులు చేసి పూర్తి చేస్తున్నాము. ఆ బిల్లులను ప్రభుత్వం ఏండ్ల తరబడి చెల్లించడం లేదు. నాకు రూ. 20 లక్షలకు పైగా చేసిన బిల్లులు రావాల్సి ఉంది. అప్పులు చేసి పనులు చేశాను. వెంటనే బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి.
నోముల వెంకట నరసమ్మ, సర్పంచ్, తూటికుంట్ల
పంచాయతీ చెక్కులు కూడా మారడం లేదు
నెలవారీ గ్రామపంచాయతీ చెక్కులు కూడా నెలల తరబడి మారకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ట్రెజరీలో చెక్కులు వేస్తే ఐదు నెలలు పడుతోంది. దీనివల్ల గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. చిన్న చిన్న పనులు చేయించలేకపోతున్నాం. గ్రామపంచాయతీ నెలవారీ చెక్కులను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే ట్రెజరీ అధికారులు అనుమతులు మంజూరు చేయాలి.
భాగం శ్రీనివాసరావు, సర్పంచ్ గోవిందాపురం(ఏ)