Authorization
Tue April 08, 2025 01:29:40 am
- కేంద్రబడ్జెట్‌పై ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్ అరుణ్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు మినహా అన్నిరంగాల ప్రజలకూ నష్టాన్ని కలిగించేదేనని ప్రముఖ ఆర్థికవేత్త, జేఎన్‌యూ ప్రొఫెసర్ (రిటైర్డ్) అరుణ్‌కుమార్ చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో 'కేంద్రబడ్జెట్ (2022-23) బ్లాక్ అండ్ వైట్' అంశంపై మంగళవారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త (రిటైర్డ్) ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, అనువాదకులుగా కొండూరి వీరయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్లోని పలు అంశాలను రంగాలవారీగా ప్రస్తావించారు. కోవిడ్ విపత్కర కాలంలో ఆరోగ్యరంగానికి నిధులు కేటాయించలేదనీ, ఉపాధి హామీ చట్టానికి గత ఏడాది రూ. 93వేల కోట్లు కేటాయించి, ఇప్పుడు రూ. 78 వేల కోట్లకు తగ్గించారని తెలిపారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోతే, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, పేదలపై పరోక్ష పన్నుల భారాన్ని మోపుతూ ఆర్థిక అసమానతలు పెంచేలా నిధుల కేటాయింపులు చేశారని విమర్శించారు. ''ఉపాధి తగ్గింది. ఉన్న పనులు పోతున్నాయి. ధరల పెరుగుదల మాత్రం ఆగట్లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వుబ్యాంకు కార్పొరేట్ కంపెనీల ధరల నిర్ణయంపై సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. గడచిన రెండేండ్లలో ప్రజల ఆదాయాలు పడిపోయిన టైంలో కార్పొరేట్ల లాభాల రేటు 24 శాతం పెరిగిందనీ, ధరల నిర్ణయాధికారం కార్పొరేట్ల చేతిలోఉండటం వల్లే ఈ లాభాలు పెరిగినట్టు ఆ సర్వేలో తేలిందని ఉదహరించారు. ఆటోమోబైల్రంగంలో చిప్‌ల కొరత ఏర్పడిందనీ, వాటి దిగుమతులు వల్ల ధరలు పెరిగాయని వివరించారు. ధరలను అదుపు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రణాళికలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్ సమస్యల్ని ఎదుర్కొవడం కోసమే బడ్జెట్ కు రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదనీ, ఇది కరెక్ట్ కాదన్నారు. ఎక్కడా తాత్కాలిక, దీర్ఘకాలిక అవసరాలు తీర్చే విధాన నిర్ణయాలే లేవని చెప్పారు. వ్యవసాయరంగంలో భౌతిక పనులు, ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారనీ, నూతన విద్యావిధాన అమల్లోనూ నిధుల కోత విధించారని ఉదహరించారు. ఇవన్నీ భవిష్యత్ తరాలకు నష్టం కల్గించే అంశాలని అన్నారు. ఏటా కోటిన్నర మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తుంటే ఆత్మనిర్భర భారత్ పేరుతో ఏటా 12 లక్షల ఉద్యోగాలు ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఉత్పత్తిని పెంచేదిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నదనీ, ప్రజల్లో కొనుగోలు శక్తే లేనప్పుడు ఆ వస్తువులను ఎవరికి అమ్ముతారని అడిగారు. ప్రపంచవ్యాప్తంగా పన్నుల వ్యవస్థ సంపన్నులకు అనుకూలంగా ఉందనీ, వారిపై పన్నుల శాతం పెంచాలనే డిమాండ్లు ముందుకొస్తున్నాయని వివరించారు. వర్తమాన భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్ లేదన్నారు. డిజిటల్ కరెన్సీ వల్ల బిట్‌కాయిన్ విలువ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. దీ నిపై రిజర్వుబ్యాంకు విధివిధానాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. చైనా సహా పలు దేశాలు డిజిటల్ కరెన్సీపై పలు ప్రయోగాలు చేస్తున్నాయనీ, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల క్రిప్టో కరెన్సీలు, మారకకేంద్రాలూ ఉన్నాయని వివరించారు.