Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ వ్యాఖ్యలకు నిరసనగా
- నేడు దిష్టిబొమ్మల దహనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు విని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పటు చేస్తే... అప్రజాస్వామికంగా విభజించిందంటూ మోడీ నీచస్థాయిలో మాట్లాడారని విమర్శించారు. వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోకూడదంటూ 2009లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారిని ఒప్పించి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని చెప్పారు. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ నిర్ణయంమేరకు ఓటింగ్ లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ఆమోదించారని గుర్తు చేశారు. రాజ్యసభలో అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సైతం దీనిపై చర్చల్లో పాల్గొన్నారని వివరించారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలమేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారనీ, చట్టసభల్లో క్షమాపణ చెప్పి తప్పుఒప్పుకుంటేనే మోడీకి గౌరవం ఉంటుందని హెచ్చరించారు. చదువు సంధ్యాలేని వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి కావడం దురదష్టకరమన్నారు. ప్రధాని విషయ పరిజ్ఞానంతో మాట్లాడకుండా ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రస్తుత పరిస్థితికి మోడీనే కారణమనీ, రాష్ట్ర విభజన హామీలను ఆయన నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చ లేని వ్యక్తికి ప్రధానిగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో దూకి మోడీ ఆత్మహత్య చేసుకోవాలని సూచించారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అధమ స్థానంలో ఉన్న వ్యక్తిలా మాట్లాడారని విమర్శించారు. జవహర్‌లాల్‌నెహ్రు నుంచి మన్మోహన్ సింగ్ వరకు ప్రధానుల ప్రసంగాలు రికార్డు అయి ఉన్నాయనీ, కానీ మోడీ వ్యాఖ్యలు వింటుంటే, ఆయనకు ప్రధాని స్థాయి లేదనే విషయం తేలిపోయిందన్నారు. తెలంగాణ పట్ల చిన్న చూపు చూసేలా ప్రధాని ప్రసంగం ఉందని విమర్శించారు. మేనేజ్మెంట్ స్కిల్స్‌తో మోడీ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీనే మోసం చేసి గుజరాత్ సీఎం అయిన ఘనుడు మోడీ అని ఎద్దేవా చేశారు. 1997 కాకినాడలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తామని బీజేపీ తీర్మానిందనీ, అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానాలకు బీజేపీ బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, కనీసం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఖండించడం లేదని విమర్శించారు. విభజన అంశాల గురించి వెంకయ్యనాయుడును అడిగి తెలుసుకునేందుకు మోడీ ప్రయత్నించాలని సూచించారు.