Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ బిల్లును అమలుచేస్తేనే రాష్ట్రానికి అప్పులు
- నిధులివ్వక కేంద్రం మెలికలెన్నో
- బీజేపీ చేసిందేమీ లేదు: మంత్రి హరీశ్
నవతెలంగాణ-హుస్నాబాద్
విద్యుత్ సంస్కరణ బిల్లును రాష్ట్ర్రంలో అమలు చేస్తేనే తెలంగాణకు అప్పులు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెలిక పెట్టి రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సబ్సిడీల్లో కోత, ధరల పెరుగుదల తప్ప దేశ ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, పార్టీని బొందపెడితేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాది రాష్ట్రాలను ఒకలాగా, దక్షిణాది రాష్ట్రాలను మరోలా చూస్తూ ఆర్థిక భారం మోపుతూ పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష గట్టి వేధిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉండటంతో ఉత్తర భారత దేశంలో ధరలు పెంచలేదనీ, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డీఏపీ, పొటాషియం ధరలు పెంచి పక్షపాత వైఖరి కనబరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ప్రతేడాది రాష్ట్ర జీఎస్ డీపీలో 4 శాతం అప్పు తీసుకునే అవకాశం ఉన్నా.. ఈ సారి 3.5 శాతమే ఇస్తామనీ, మిగతా అర శాతం నిధులు కావాలంటే.. విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రయివేటు పరం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని ఆరోపించారు. అయితే తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. మీటర్లు పెడితే అర శాతం అంటే.. రూ.5 వేల కోట్లు రాష్ట్రానికి కోత పడినట్లేనని మంత్రి చెప్పారు. విద్యుదుత్పత్తి అయ్యే బొగ్గుపై కూడా కేంద్రం విపరీతంగా సెస్ పెంచి భారం వేసిందని, ఉచితంగా వచ్చే లోయర్, సీలేరు పవర్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారన్నారు. లోయర్ సీలేరు ఉంటే 10 పైసలకే విద్యుత్ వచ్చేదన్నారు. ఒకప్పుడు రూ.400 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని చెప్పి, ఏడాది మాత్రమే ఇచ్చి ఇప్పుడు రూ.40కి కుదించారని తెలిపారు. ఎఫ్‌సీఐకి సైతం కోత పెట్టారని, రైతులు పండించిన ధాన్యం సేకరించే సబ్సిడీలో దాదాపు రూ.40 వేల కోట్లు కోత పెట్టినట్టు చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పకనే చెబుతోందన్నారు.