Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల తరబడి చెల్లించని సర్కారు
- ఒత్తిడి పెరిగితే అరకొరగా విదుల్చుతున్న వైనం
- ఈసారి రాష్ట్ర బడ్జెట్‌పై గంపెడాశలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనది ధనిక రాష్ట్రం.. మిగులు రాష్ట్రమంటూ మొన్నటి వరకూ చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ సర్కార్, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రతీయేటా బడ్జెట్ సందర్భంగా పద్దును పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం... ఆ మేరకు వివిధ కీలకాంశాలకు నిధులను విడుదల చేయటంలో మాత్రం తాత్సారం చేస్తున్నది. వీటిలో కొన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పథకాలు కాగా... మరికొన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన స్కీములు. ప్రజలకు, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు అవి అత్యంత ముఖ్యమైనవి. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్ఎస్ సర్కారు.. ఏటా బిల్లులు చెల్లించకుండా వాటిని పెండింగ్‌లో ఉంచుతున్నది. దీంతో ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఆ పథకం కింద పేదలకు వైద్యం చేయటానికి నిరాకరిస్తున్నాయి. ఉస్మానియా, కాకతీయతోపాటు అనేక విశ్వవిద్యాల యాలకు సంబంధించిన మెస్ బిల్లులదీ ఇదే పరిస్థితి. దీంతో విద్యార్థులే చేతి నుంచి డబ్బులు చెల్లించి, హాస్టళ్లలో భోజనం చేయాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్థానంలో తెలంగాణ సర్కార్... ఫాస్ట్ (ఫైనాన్షియల్ ఎసిస్టెన్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ)ను ప్రవేశపెట్టింది. కానీ దానికి కూడా నిధులు విడుదల చేయకపోవటం గమనార్హం. ఇవిగాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలీహౌజ్‌లు, గ్రీన్‌హౌజ్‌లు, వ్యవసాయానికి ట్రాక్టర్లు తదితర కార్యక్రమాలకు సబ్సిడీలు, రాయితీలను ఇవ్వకుండా ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు బకాయిలు కూడా ఇప్పటికీ మూలుగుతు న్నాయి. వీటన్నింటికీ కలిసి సుమారుగా రూ.25 వేల కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమ యంలో రాష్ట్రంలో రహదారులు, భవనాలు, చిన్నా, చితకా ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వారు అప్పులు చేసి మరీ ఆయా నిర్మాణాలను పూర్తి చేశారు. కానీ ముఖ్యమంత్రి నుంచి నేరుగా ఆదేశాలు వస్తేగానీ వారికి ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించని పరిస్థితి. పైరవీలు, సిఫారసులు చేయించుకునే వారికి బిల్లులు వెంటనే వస్తున్నాయి కానీ...అధికారికంగా ఎలాంటి అండాదండా లేని తమలాంటి వారికి మాత్రం వాటిని చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ చిన్న కాంట్రాక్టరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై వారందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. ఈసారి పద్దు ద్వారానైనా తమ కష్టాలు గట్టెక్కుతాయనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు.