Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన సమస్యలు తీర్చకుండా ఎందుకీ మాటలు..
- దృష్టిమరల్చటానికే.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చ కుండా ప్రధాని మోడీ... ఆయా రాష్ట్రాల గురించి పార్లమెంటులో ప్రస్తావించటం ద్వారా ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని సీపీఐ (ఎం) పేర్కొంది. ఆయా హామీల గురించి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని ప్రజలు చర్చిస్తున్నారు కాబట్టి, వాటి నుంచి దృష్టి మరల్చటానికే ప్రధాని ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో విమర్శించారు. ఏడేండ్ల కింద జరిగిన విభజన గురించి ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టటం దేనికని నిలదీశారు. తెలంగాణ, ఏపీ అభివృద్ధి, వాటికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, ఆర్థిక సాయాలు, ఇతర ప్యాకేజీల గురించి ప్రధాని మాట్లాడితే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ తదితర హామీలను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అవి ఎటుపోయాయని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కూడా లాగేసుకోవటం ద్వారా మోడీ సర్కారు... రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటి గురించి మాట్లాడాలంటూ మోడీని కోరారు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణిని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు.