Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం : ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చెట్లు నాటడమే కాలుష్య నివారణకు మార్గమని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశ రాజధానిలో లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలోని కరోల్‌భాగ్ జోన్ నరైనా ఇండిస్టీయల్ ఏరియా పార్కులో వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి మొక్కలను ఆయన నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేండ్ల కింద తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. పచ్చదనం పెంపు దిశగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలుదిశలా హరితస్ఫూర్తిని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామనీ, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని దశలవారీగా పూర్తిచేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..సంతోశ్ ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడనీ, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకతీతంగా హరిత భారత కార్యక్రమాన్ని తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరామ్ రమేష్ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజరు సింగ్ అన్నారు. పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు తక్షణావసరమని శివ సేన ఎంపీ అనిల్ దేశారు అన్నారు. రామ్కీ సంస్థ చైర్మెన్, ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంపీ బినోరు విశ్వం, ఏపీకి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, జి.రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కెఆర్, సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, పీ. రాములు, ఇతర ఎంపీలు, సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్.బలరామ్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శశాంక్ ఆల, తదితరులు, పాల్గొన్నారు.