Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పిలేట్ ట్రిబ్యునల్ కూడా లేదు
- రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చట్టం అమలయ్యేలా చూడండి
- గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను వెంటనే ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమెకు బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ చట్టం అమలయ్యేలా చూడాలని కోరారు. స్థిరాస్థి రంగంలో నియమ నిబంధనలు అమలు చేసేందుకు, ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు, కొనుగోలు దారులు మోసపోకుండా ఉండటానికి అలాగే ఏమైనా వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం జరిపి తొందరగా పరిష్కరించడానికి పార్లమెంట్లో రియల్ ఎస్టేట్ చట్టాన్ని 2016లో తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ చట్టంలో భాగంగా తెలంగాణలోనూ నిబంధనలు తయారుచేశారని తెలిపారు. ఆ చట్టం సెక్షన్ 20 (1) ప్రకారం ఏడాదిలోగా రెగ్యులేటరీ అథారిటీలో అధ్యక్షులు, ఇద్దరు సభ్యులు తక్కువగా కాకుండా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఆరు ప్రకారం ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ తివారీని రెగ్యులేటరీ అథారిటీ నియమించిందని తెలిపారు. అయితే, అథారిటీకి అధ్యక్షులు, సభ్యులను మాత్రం నేటి వరకూ నియమించలేదని వివరించారు. సెక్షన్ 43 (1) ప్రకారం చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనీ, లేదంటే ఏదైనా ట్రిబ్యునల్‌కు కేసులను అప్పగించాలని తెలిపారు. అందులో భాగంగానే జీఓ నెంబర్ 8 ద్వారా వ్యాట్ ట్రిబ్యునల్‌ను నామినేట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. నాలుగేండ్లవుతున్నా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చట్టం అమలు కావడం లేదని పేర్కొన్నారు. వీటన్నింటిని గమనించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బిల్డర్లకు కొమ్ము కాస్తుందనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. బిల్డర్లు, ఏజెంట్లు చట్ట ప్రకారం రియల్ ఎస్టేట్ అథారిటీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలనీ, కానీ, రాష్ట్రంలో అలా జరగట్లేదని తెలిపారు. బిల్డర్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్లాట్లు, అపార్టుమెంట్లు, ఇండ్లు అమ్మడానికి ప్రకటనలు, బుక్ చేసుకోవడం వంటివి చేయకూడదంటూ చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నార్లు. అయితే, కొంతమంది బిల్డర్లు, ఏజెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతూ సామాన్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.