Authorization
Mon April 07, 2025 08:38:06 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఖండించారు. ధర్నాకు అనుమతిని నిరాకరించడం అప్రజాస్వామికమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. భార్యాభర్తలు, పరస్పర బదిలీల్లో అనేక అవకతవకలు జరిగాయని తెలిపారు. దీంతో వారి సర్వీసు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అవకతవకలను సరిచేయాలనీ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని కోరారు.
ఇది నిరంకుశ చర్య : న్యూడెమోక్రసీ
317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ఉపాధ్యాయుల ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. ఇది నిరంకుశ చర్య అని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపైన నిరసనలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు, చినజీయర్ స్వామి సంబరాలకు అనుమతి ఇస్తూ 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం పోలీసుల దురుద్దేశ్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ శ్రేణులకు అనుమతి ఎలా ఇచ్చారు : ఆప్
ఉపాధ్యాయుల అరెస్టులను ఆప్ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ ఖండించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. టీచర్ల ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యోగులకు నిరసన తెలిపే హక్కు లేదా?అని అడిగారు. 371-డీకి సవరణ చేయకుండా అందుకు లోబడి 317 జీవోను ఎలా తెస్తారని ప్రశ్నించారు. అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.