Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు
- ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు : మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఉన్నాయనీ, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ వినతిపత్రాలిచ్చినా కనీసం స్పందన లేకపోవడం దారుణమన్నారు. కేంద్రం నిధులివ్వకున్నా వివిధ రంగాలలో తెలంగాణ గొప్పగా పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కూడా అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రానికి గొప్ప ఆదాయ వనరులిచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులివ్వడం, ఇతర రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేయడం కేంద్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. తెలంగాణ భూభాగంలో ఉన్న సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేసి మోడీ తమకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే స్పందనలేదని విమర్శించారు. ఐటీఆర్ ప్రాజెక్టుకు 49 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. కావాలనే కర్ణాటకకు తరలించారని విమర్శించారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌నూ పట్టించుకోవట్లేదన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మూడు రాష్ట్రాల్లోనూ నేటికీ సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పూర్తవుతుందనీ, అందులో భాగంగానే విగ్రహ కంపెనీలను సందర్శించామని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్న క్రమంలో రాజ్యాంగంలో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ, అర్ఎస్ఎస్ భావజాలమంతా కూడా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమైనదని విమర్శించారు.