Authorization
Tue April 08, 2025 02:34:15 am
- రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు
- పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-విలేకరులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలను అగౌరవపరిచిన ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనతో లౌకిక వాదం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మత రాజకీయాలతో అధికారం సాధించాలనే ఆలోచన మానుకోవాలని హితవుపలికారు.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గం ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బోట్స్ క్లబ్, ట్యాంక్ బండ్,బీఆర్కే భవన్, ఏజీ ఆఫీస్ మీదుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్,ఎమ్మెల్యేలు దానం నాగేందర్,మాగంటి గోపినాథ్,కాలేరు వెంకటేష్,ముఠా గోపాల్ అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు.
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో పట్టణ ప్రధాన కూడల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. 36వ వార్డులో మోడీ బొమ్మతో శవయాత్ర చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ అన్ని మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ ఆధ్వర్యలో నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు మోడీ దిష్టిబొమ్మ తో శవయాత్ర చేసి దహనం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.
వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలు వేసుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ దాడులు
జనగామ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత
మోడీ వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అప్పటికే చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడికి టీఆర్ఎస్ శ్రేణులూ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మోడీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. దాంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జెండా కర్రలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలను తరిమి కొట్టారు. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొంత మంది బీజేపీ నాయకులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.