Authorization
Tue April 08, 2025 02:34:14 am
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హాలియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియాలోని సుందరయ్య భవనంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు రాష్ట్ర విభజనకు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. ఆ తర్వాత నుంచి అధికారంలో ఉడి రెండు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించడమే కాకుండా అర్ధరాత్రి తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేశారని చెప్పడం కపట నాటకం అని విమర్శించారు. రాజ్యసభలో ఇచ్చిన హామీల సంగతేమిటని ప్రశ్నించారు. గతంలో విభజించిన రాష్ట్రాల అభివృద్ధి శూన్యం అని, అభివృద్ధి చేయలేక మాటలతో కాలయాపన చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ప్రజలపై పన్ను భారం మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు, బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. నేడు అనేక పరిశ్రమలను మూసేస్తున్నారని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా కుదించి కార్మికవర్గాన్ని శ్రమ దోపిడీ చేసి పెట్టుబడిదారులకు పంచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పటం అర్థరహితమన్నారు. ఆ రాజ్యాంగం తోటే ఈయన అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులను అని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేందుకు నిధులు కేటాయించలేదన్నారు. ఉపాధి హామీకి నిధుల కోత విధించి చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసేందుకు కంకణం కట్టుకొని దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, అవుతా సైదయ్య పాల్గొన్నారు.