Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లవుతున్నా విభజన సమస్యలెందుకు పరిష్కరించేదు?
- నేటి నుంచి భోజన విరామ సమయంలో ధర్నాలు, నిరసనలు
- ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ మామిళ్ల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ పార్లమెంట్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ మామిళ్ల రాజేందర్ అన్నారు. గురువారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఎన్జీఓ భవన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు, ప్రజలు కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 42 రోజుల సకల జనుల సమ్మె, సాగరహారం, వంటావార్పు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం మోడీకి తెల్వదా? అని నిలదీశారు. గతంలోనూ ఇలాగే రెండు, మూడుసార్లు మాట్లాడారనీ, దేశ ప్రధాని అలా చేయడం తగదని సూచించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఎనిమిదేండ్లుగా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. 9,10 షెడ్యూల్ కంపెనీల విభజన నేటికీ జరగలేదన్నారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తిగా జరగలేదనీ, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చర్చలు జరిపి విభజన, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐటీ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.ప్రధాని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు .ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర విభజనపై ప్రధాని మాట్లాడటం తగదన్నారు. 1200 మంది అమరవీరులను అవమానించడమేనన్నారు. తెలంగాణ బిల్లుకు సుష్మాస్వరా జ్ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని మోడీకి సూచించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ఉద్యోగుల డిమాండ్ మోడీ సర్కారుకు ఎందుకు పట్టట్లేదని ప్రశ్నించారు. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, నాయకులు ముజీబ్, వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు కృష్ణయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై టీజీఓల నిరసన
దశాబ్దాల పాటు ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అవహేళనగా మాట్లాడటాన్ని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని టీజీఓ కార్యాలయం వద్ద మోడీ వ్యాఖ్యలను వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు మమత మాట్లాడుతూ..ప్రధాని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రధాని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, కోశాధికారి పి.రవీందర్‌కుమార్, సహ అధ్యక్షులు ఎస్.సహదేవ్, ఉపాధ్యక్షులు టి.రవీందర్రావు, బి.వెంకటయ్య, అరుణ్‌కుమార్, నగరశాఖ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్బీ కృష్ణయాదవ్, నాయకులు లక్ష్మణ్‌గౌడ్, హరికృష్ణ, సబిత, పరమేశ్వర్‌రెడ్డి, గోపి, తదితరులు పాల్గొన్నారు.