Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వాట్సాఫ్ యూనివర్సిటీకి దిమ్మదిరిగే కౌంటర్లు
- 'తెలంగాణ శత్రువు మోడీ' హ్యాష్ ట్యాగ్ వైరల్
- దిష్టిబొమ్మల దహనం...ర్యాలీలు, ధర్నాలు
- నల్లరిబ్బన్లతో నిరసనలు
- విభజన హామీలపై ప్రశ్నల వర్షం
- డోలాయమానంలో రాష్ట్ర కమలనాథులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్రమోడీపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర పార్టీలు, విద్యార్థులు, యువకులు, మేధావులు 'తెలంగాణ శత్రువు మోడీ' అంటూ ట్వీట్లు ప్రారంభించారు. తెలంగాణ నుంచి వెల్లువెత్తుతున్న ఈ ట్వీట్లు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. ఉన్నది లేనట్టు...లేనిది ఉన్నట్టు తెగ వైరల్ చేస్తూ ప్రజలను నమ్మిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాట్సాఫ్ యూనివర్సిటీకి సైతం ఈరకంగా జనాలు దిమ్మదిరిగే కౌంటర్లిస్తున్నారు. వాట్సాఫ్ యూనివర్సిటీ ఉహకందని విధంగా మోడీ వైఖరిని తప్పుపడుతూ 'తెలంగాణ శత్రువు మోడీ' అంటూ నెటిజన్లు హ్యాష్‌ట్యాగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మోడీకి...అదే సోషల్ మీడియాలో నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రధానిని వ్యతిరేకంగా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాఫ్, ఇన్స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాల ద్వారా గంటలోపే లక్షలాది మంది దాన్ని వైరల్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఎందుకు శత్రువు అనే విషయాన్ని నెటిజన్లు స్పష్టత ఇచ్చారు. 60 ఏండ్లుగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రజల ఆకాంక్షలమేరకు ఏర్పడిందనీ, దాన్నే ఆయన అవహేళన చేసేలా మాట్లాడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న... ఏ ఒక్క హామీని బీజేపీ సర్కారు నెరవేర్చలేదంటూ నిలదీశారు. ఎనిమిదేండ్లుగా బీజేపీ కేంద్ర సర్కారు...రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తున్నదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకవైపు మోడీపై సామాజిక మాధ్యమాల్లో బాణం ఎక్కుపెట్టిన తెలంగాణ ...మరోవైపు బీజేపీ సర్కారు దిష్టబొమ్మల దహనాలు, ర్యాలీలు, ధర్నాలతో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదికొచ్చారు. ఇంకోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏకంగా ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఆయా జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.నల్లరిబ్బన్లతో నిరసనలు తెలిపారు.
తెలంగాణ శత్రువు మోడీ ట్వీట్టర్లో తొలగింపు
పొద్దంతా సామాజిక మాధ్యమాల్లో 'తెలంగాణ శత్రువు మోడీ' అనే వ్యాఖ్యలు వైరల్ అయిన నేపథ్యంలో ట్రెండింగ్‌ను బీజేపీ తట్టుకోలేకపోయింది. సాయంత్రం వరకు ట్విట్టర్‌ను మేనేజ్ చేసి ఆ తర్వాత వాటిని తొలగించినట్టు నెటిజన్లు చెబుతున్నారు. బీజేపీ వాట్సాప్్ యూనివర్సిటీ దానికి ప్రతిగా 'తెలంగాణ లవర్ మోడీ' అనే కామెంట్లు బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం.