Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
- అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ ముందంజ
- ఏడేండ్లలో కేంద్రం పైసా కేటాయించలేదు
- మోడీ తెచ్చిన నల్ల చట్టాలు తప్పని రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది
- ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ సభలో మంత్రి కేటీఆర్ విమర్శలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేవాలయంలాంటి పార్లమెంట్లో మోడీ అబద్దాలాడుతున్నాడనీ, విశ్వాసం నింపాల్సిన చోట.. విద్వేషపు మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్న ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఏడేండ్లలో తెలంగాణకు కేంద్రం పైసా కేటాయించలేదని విమర్శించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, మోడీ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.221 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కొంతమందికి కడుపు మండుతోందని, గుజరాత్ కంటే ముందుకు దూసుకెళ్తుందన్న బాధతో ప్రధాని పార్లమెంట్లో రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ప్రజాస్వామ్య దేవాలయంలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. తల్లిని చంపి బిడ్డనిచ్చారన్నారనీ, అవి మాట్లాడాల్సిన మాటలేనా.. ఇప్పుడెందుకు అలా అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇంత అన్యాయంగా, ఆ సందర్భంగా, ఇష్టారీతిన మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాన్ని కించపరిచినట్టు కాదా అని ప్రశ్నించారు. ఈ ఎనిమిదేండ్లలో పారిశ్రామిక రాయితీలు, రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కూడా ఇవ్వలేదన్నారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కుకి అరపైసా సాయం చేయలేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐటీఐఆర్ సంస్థలు ఒక్కటీ కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. 50 ఏండ్ల్ల తెలంగాణ పోరాటాన్ని, వందలాది మంది త్యాగాలను అవమానించినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని అన్ని సంస్థలను మోదీ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు తపుపడుతున్నారన్నారని, దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని.. మోదీ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బెంగాల్ ప్రభుత్వం గవర్నర్‌ను బ్లాక్ చేసినా ఎందుకు సమన్వయం చేయడంలేదని ప్రశ్నించారు. కర్నాటకలో మత విద్వేశాలు రెచ్చగొడుతూ బేటీ బచావో.. బేటీ పడావో మాటలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. మోడీ తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు చేసిన పోరాటానికి తలొగ్గి.. చివరకు చట్టాలు రద్దుచేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్ సాయిచంద్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ కృపేష్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.