Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసన తెలిపే హక్కును కాలరాసింది. 317 జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బుధవారం తలపెట్టిన మహాధర్నా నిర్బంధాల మధ్యే జరిగింది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయినా 317 జీవో బాధిత ఉపాధ్యాయులు భారీగా తరలొచ్చారు. చంటిపిల్లలతో మహిళా టీచర్లు హాజరు కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. వారి నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. ఉపాధ్యాయుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు. '317 జీవోను సవరించాలి, విరు వాంట్ జస్టిస్, సీనియార్టీ మాత్రమే వద్దు, స్థానికత ముద్దు, భార్యాభర్తలను కలపండి, విడదీయొద్దు, భార్య ఒక జిల్లా?, భర్త ఒక జిల్లా?'అంటూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, యూ పోచయ్య, ఎస్ హరికిషన్, జాదవ్ వెంకట్రావు, ఎన్ యాదగిరి, టి విజయసాగర్, బి కొండయ్య, ఎస్ మహేష్, వై విజయకుమార్ తదితరుల నేతత్వంలో బుధవారం వందలాది మంది ఉపాధ్యాయులు దోమలగూడ రోడ్డు నుంచి ప్రదర్శనగా ధర్నాచౌక్ వద్దకు తరలివచ్చారు. ప్రారంభంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు విడతల వారీగా ధర్నాచౌక్‌కు తరలొచ్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్, చిక్కడపల్లి, బేగంబజార్, అబిడ్స్, రాంగోపాల్ పేట, సైఫాబాద్, నాంపల్లి, నారాయణగూడ, అంబర్‌పేట, ముషీరాబాద్, బొల్లారం పోలీస్స్టేషన్లకు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచే వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డి సైదులు, షౌకత్ అలీ, ఎ గంగాధర్ తదితరులూ జిల్లాల్లో అరెస్ట్ అయ్యారు. 'కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్థానికత కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చింది. ఉద్యమం చేయకుండానే తెలంగాణ వచ్చిందా?. యూఎస్పీసీ మహాధర్నా అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదు. 317 జీవో బ్రహ్మాండంగా ఉంటే ఉపాధ్యాయులు ఇంత పెద్దఎత్తున హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు. సీఎం కేసీఆర్ దీపిపై పరిశీలించాలి. మేం పాఠాలు చెప్తేనే మీరు పోలీసులయ్యారు. మమ్మల్ని అడ్డుకోవడం, అరెస్టు చేయడం సమంజసం కాదు. మా అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి'అంటూ పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలి :
చంటి బిడ్డతో హాజరైన మహిళా ఉపాధ్యాయురాలు
'నేను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలో పనిచేశాను. నన్ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పక్కన చౌదరిగూడ మండలంకు బదిలీ చేశారు. ఇదెక్కడి న్యాయం. శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుంచి వచ్చిన వారు హాయిగా ఉన్నారు. మేం స్థానికులం. మాకు అన్యాయం జరుగుతున్నది. స్థానికతకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలి. కానీ స్థానికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేం స్థానికేతరులం అయ్యాం, వారు స్థానికులయ్యారు. ఇది అన్యాయం. చిన్న బాబు ఉన్నారు. కుటుంబంతో అక్కడికి ఎలా వెళ్లాలి. 120 కిలోమీటర్లు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉన్నది. నన్ను మేడ్చల్ జిల్లాకు కేటాయించాలి.'అని బాధిత మహిళా టీచర్ అన్నారు.
బాధిత టీచర్లకు న్యాయం చేయాలి : యూఎస్పీసీ నేతలు
ధర్నాచౌక్‌తోపాటు పోలీస్స్టేషన్లలో ఉన్న యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నేతలు చావ రవి, కె జంగయ్య, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, కె రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును నిరాకరించడం సరైంది కాదని విమర్శించారు. అధికార పార్టీ నిరసనలను దగ్గరుండి జరిపించిన పోలీసులు ఉపాధ్యాయుల శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన వారు, సీనియార్టీలో లోపాలు, ఎస్సీ,ఎస్టీ సామాజిక తరగతులకు దామాషా పాటింపులో పొరపాట్లు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అంతర్జిల్లా బదిలీలో జిల్లాలు మారిన వారు, భార్యాభర్తలు తదితర కేటగిరీలకు జరిగిన నష్టాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.
పరస్పర బదిలీలకు ఇచ్చిన 21 జీవోను సవరించాలని కోరారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
మానసికంగా కుంగిపోతున్నా
'నేను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పనిచేశాను. ఇప్పుడు జగిత్యాలకు కేటాయించారు. మా సొంతూరు నుంచి 190 కిలోమీటర్లు వెళ్లి ఎలా పనిచేయాలి. కుటుంబాన్ని మార్చడం సాధ్యం కాదు. మానసికంగా కుంగిపోతున్నా. సీనియార్టీతోపాటు స్థానికత ఆధారంగా కేటాయింపులు చేస్తే బాగుండేది. ఈ జీవోను సవరించాలని కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నా స్థానికత హన్మకొండ జిల్లా. కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపారు. అందుకే నన్ను ఈ జిల్లాకు కేటాయించాలి.'అని వేణుమాధవ్ కోరారు.
- వేణుమాధవ్
ఒంటరి మహిళను అంతదూరం ఎలా వెళ్లాలి?
'నేను శంషాబాద్ పక్కన ముచ్చింతల్ మండలంలో తొమ్మిదేండ్లు పనిచేశాను. ఇప్పుడు నన్ను వికారాబాద్‌కు కేటాయించారు. అదీ కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బషీరాబాద్ మండలానికి బదిలీ చేశారు. జూనియర్ అనే పేరుతో పంపించారు. మా పాప సికింద్రాబాద్‌లో సెయింట్ ఆన్స్‌లో ఆరో తరగతి చదువుతున్నది. పాపను తీసుకుని ఒంటరి మహిళను అంతదూరం ఎలా వెళ్లాలి?. 145 కిలోమీటర్లు వెళ్లడం ఎలా?. ఉదయం 5.55 గంటలకు రైలులో వెళ్లాలి. రాత్రి తొమ్మిది తర్వాత ఇంటికి రావాల్సి వస్తున్నది. మా అమ్మాయి భద్రత, చదువు ఎవరు చూడాలి. నేను అప్పీల్ చేసుకున్నా నెలదాటినా పరిష్కారం కాలేదు. ఈ బదిలీ వల్ల నాకు గుండెనొప్పి వస్తున్నది. నన్ను మేడ్చల్ జిల్లాకు కేటాయించాలి.'అని హిందీ పండిట్ విజయ ఆవేదన వ్యక్తం చేశారు.
- విజయ
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి
ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇస్తే బాగుండేదని చెప్పారు. 1.08 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 1.04 లక్షల మంది జిల్లా కేటాయింపుల్లోనే ఉన్నారని వివరించారు. దీంతో 317 జీవో వల్ల ఇబ్బంది కలిగిన వారిలో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. వారు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే కారణమన్నారు. పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడిందనీ, రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలనీ, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఉద్యోగులూ వలస వెళ్తున్నారు
'మేడ్చల్ నుంచి రంగారెడ్డి జిల్లాకు కేటాయించారు. సొంత జిల్లాలోనే వలస వెళ్లాల్సి వస్తున్నది. స్థానికులకు ఎక్కడ న్యాయం జరుగుతున్నది. ఉపాధి లేక కాదు, ఉద్యోగం ఉన్నా వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మా బాధ పట్టించుకునే వారు లేరు. మాకు న్యాయం చేయాలి. స్థానికత ఉన్న జిల్లాకే కేటా యించాలి.'అని అరుణేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
- అరుణేశ్వరి