Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువుకు దూరం చేసే కుట్ర
- రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరిచ్చారు..? : ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ మిష్రిన్ సుల్తానా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'హిజాబ్ ధరిస్తే... మీకేంటి...? ఈ పేరుతో మమ్మల్ని చదువుకు దూరం చేసేందుకు మీరు కుట్ర పన్నుతున్నారు...' అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మిష్రిన్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కర్నాటకలో జరిగిన సంఘటనలపై ఆమె సోషల్ మీడియా వేదికగా పాలకులకు సంధించిన ప్రశ్నలు వైరల్ అయ్యాయి. 'మనుధర్మం ప్రకారం స్త్రీ స్వాతంత్య్రానికి సంకెళ్లు వేయజూస్తున్నారు. మనం భారతదేశంలో ఉన్నాం. ఇక్కడి రాజ్యాంగం కూడా అందరికీ సమాన హక్కులను కల్పిస్తోంది. దాన్ని ప్రతిఒక్కరం అనుసరిస్తున్నాం. ఆచరిస్తున్నాం. వాటి ప్రకారం..ఏది కావాలనుకుంటే అది ధరించమని, ఏది చదవాలని ఉంటే దాన్ని చదువు అని రాసి ఉన్నది. విద్యా హక్కు ప్రకారం.. ఇప్పుడు మమ్మల్ని దాన్నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఓవైపు బేటీ బచావో..బేటీ పడావో అంటూ..కేవలం ముస్లిం విద్యార్థినులు అనే కారణంతో..చదువునుంచి దూరం చేస్తారా..? ఆ యువతులను జీవించే అధికారాన్ని గుంజుకోవాలనుకుంటున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం..? హిజాబ్ ధరించి చదువుకోవాలనుకుంటున్న ముస్లిం యువతులను కాషాయ మూకలు అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్..? రాజ్యాంగ సవరణలు తెచ్చి..రుద్దాలనుకున్నా... అవి ఆమోదయోగ్యం కాకపోతే...వాటిపై గళమెత్తుతాం. పోరాటం చేస్తాం. అలా చేస్తే మాపై రాజద్రోహం ముద్రవేస్తారా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వతీరుపై ఎవరైనా విమర్శిస్తే..వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి తీరు సరైందేనా..? రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ప్రకారం..భావ స్వేచ్ఛ ప్రకటన, నిర్దేశిత హక్కులకు లోబడి బతకమని ఉన్నది. ఆ హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఎందుకని అడ్డుకుంటుంది.? ఆక్షేపిస్తోంది..? ఆ పార్టీ మనుధర్మం శాస్త్రాన్ని అనుసరిస్తోంది. దాని ప్రకారం.. స్త్రీ స్వాతంత్య్రానికి అనర్హురాలు. ఇప్పుడు బీజేపీ దాన్ని అమలు చేయాలనుకుంటున్నదా..? ఇలాంటి దురాలోచనను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ తరపున హెచ్చరిస్తున్నాం...' అని సుల్తానా తెలిపారు.