Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధూర్-టర్బన్-హిజాబ్-క్రాస్ ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే
- ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏం ధరించాలన్న విషయాన్ని స్త్రీలకే వదిలేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆమె స్పందించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల విద్వేషాలకు భయపడి, అందమైన భవిష్యత్ కోసం కలలు కంటున్న ఆడపిల్లల సుందర స్వప్పాలను చిదిమివేయొద్దని సూచించారు. విద్యాలయాల్లో రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారు. స్త్రీలు వారి ఇష్టంతో ఏదైనా ధరించొచ్చని తెలిపారు. వారి వ్యక్తిగత విషయాల్లో నాగరిక సమాజం జోక్యం చేసుకోకూడదని సూచించారు. విభిన్న సంస్కృతులు, మతాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ఒక్కరికీ పరమత సహనం ఉన్నపుడే దేశంలో భిన్నత్వం ఉంటుందని తన చేతితో రాసిన కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు... హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందని వివరించారు. 'ఎలా ఉండాలి? ఏం ధరించాలి? ఏం చేయాలి? అనే విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని సూచించారు. స్త్రీలు సృష్టికర్తలనీ, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని పేర్కొన్నారు. హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్ మతమేదైనా సరే అందరం భారతీయులమేనని తెలిపారు. సింధూర్-టర్బన్-హిజాబ్-క్రాస్ ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతేనని వివరించారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య అయినా.. 'జై హింద్'' అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా.. 'సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్' అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా.. 'జనగణమన'తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా.. చెప్పింది ఒక్కటేనని తెలిపారు. 'మనం ఎవరైనా... మనమంతా భారతీయులమే'' అని కవిత పేర్కొన్నారు.