Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు అధికారాలివ్వండి
- సీఎం కేసీఆర్‌కు కేవీపీఎస్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకం అమల్లో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యాన్ని నివారించాలనీ, లబ్దిదారుల ఎంపిక అధికారాలను కలెక్టర్లకు అప్పగించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కోరింది. లేదంటే అర్హులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు ఈమేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దళితబంధు పథకాన్ని టీఆర్ఎస్ అనుయాయులకు మాత్రమే వర్తించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీని ఫలితంగా అర్హులైన లబ్ధిదారులు ఎంపికకాకపోవడంతో పలు జిల్లాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్హులైన దళితులకు అన్యాయం జరిగినట్టు వార్తలొస్తున్నాయని వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం లేకుండా నేరుగా కలెక్టర్లకు ఎంపిక బాధ్యతలు అప్పగించాలని కోరారు. గ్రామసభల ద్వారా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 54లక్షల దళిత జనాభా ఉందనీ, 18లక్షలరెండువేల కుటుంబాలు నివాసిస్తున్నాయని వివరించారు. దళిత బంధు కోసం ప్రతియేటా రూ 20వేలకోట్లు కేటాయిస్తామంటూ సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతీ ఏటా బడ్జెట్ పెంచుతూ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు. రానున్న (2022-23) వార్షిక బడ్జెట్లోఇందుకోసం రూ 20వేలకోట్లు కేటాయించాలని జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు ఈ సందర్భంగా కోరారు.