Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తద్వారా రైతులను ఆదుకోండి
- మంత్రి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ రైతు సంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పసుపు రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు సంబంధిత బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లపు వెంకటేశ్ ఈమేరకు గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సంగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి లేఖ రాశారు. తమ సంఘం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిందనీ, ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో పసుపు పండిస్తున్నారని పేర్కొన్నారు. పంట చేతికొచ్చేదశలో ఉందనీ, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సరైందికాదని తెలిపారు. పసుపుకు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు, దీంతో వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి రైతులను దోపిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి జిల్లాకో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. '2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ రైతులకు రాతపూర్వకంగా బాండ్ రాసిచ్చారు. అయితే ఇప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పసుపు బోర్డు సాధించలేదు' అని పేర్కొన్నారు. పసుపు పంట సాగుకు వ్యయం కూడా ఎక్కువగా ఉందనీ, కనీసం క్వింటాలుకు రూ.15వేల ధర ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.