Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో ద్వారా నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయుల అరెస్టును సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి ధర్నాచౌక్ వద్దకు చేరుకున్న వేలాది మంది ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిపారు. మహిళా టీచర్లు పెద్దసంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.