Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బక్క జడ్సన్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లు అవినీతికి పాల్పడుతున్నారనీ, అటువంటి అధికారులపై ప్రధాని నరేంద్రమోడీ విచారణ జరిపించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఇప్పటికే అవినీతి అధికారులపై డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) స్పందించిందన్నారు.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు విజరుకుమార్, గిరితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పదకొండు మంది ఐఏఎస్ అధికారుల అవినీతి ఆందోళన కలిగిస్తున్నదన్నారు. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ (మున్సిపల్ శాఖ), సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, యువజన వ్యవహారాల కార్యదర్శి సవ్యసాచి ఘోష్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్య శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహరెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌రావు తదితరుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మళ్లించి, సంబంధిత కాంట్రాక్టర్ మెగాకష్ణారెడ్డి నుంచి తన బినామీ బిగ్వావేవ్ కంపెనీ ద్వారా రజత్‌కుమార్ లబ్దిపొందారని ఆరోపించారు. తాజ్కష్ణ, తాజ్ఫలక్నుమ ప్యాలెస్ వంటి ప్రతిష్ట్మాతక హోటళ్లలో ఆయన కుమార్తె వివాహానికి విందు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై ప్రధాని మోడీ నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని కోరారు. ఇలాంటి అవినీతిలో సీఎం కేసీఆర్ భాగస్వామ్యం ఉన్న కారణంగా ఆ కుటుంబం త్వరలోనే జైలుకు పోవడం తప్పదని హెచ్చరించారు.