Authorization
Tue April 08, 2025 06:15:09 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత సైనికులను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14న జాతీయ అమరజవాన్ దివస్‌గా నిర్వహించనున్నామని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ఎం.రామరాజు,భజరంగ్‌దళ్ ప్రాంత ప్రముఖ్ శివరాములు తెలిపారు. తాము ప్రేమికులకు వ్యతిరేకంగా కాదనీ, వాలెంటైన్ డేను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని కోఠిలో గల విజయశ్రీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.పాశ్చాత్యసంస్కృతిని తప్పుబడుతున్నామని చెప్పారు. తమ వ్యాపారాలను పెంచుకోవడం కోసం వాలెంటైన్డేను అంతర్జాతీయ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. వాలెంటైన్డేను నిర్వహించొద్దని పబ్బులు,రెస్టారెంట్లు,పార్కుల నిర్వాహకులకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామన్నారు.ఒకవేళ ప్రేమికులు పట్టుబడితే కౌన్సిలింగ్ ఇస్తామ న్నారు.దేశ వ్యతిరేకులే ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రేమికుల రోజును నిరసిస్తూ శనివారం ఆబిడ్స్ చౌరస్తాలో గ్రీటింగ్‌లను దహనం చేస్తామన్నారు. 14న పుల్వామా అమరులను స్మరించుకుంటూ కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలో, పెరేడ్‌గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.