Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాస్టిక్ వాడక రహిత జిల్లాగా మార్చేందుకు అడుగులు
- ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- జిల్లా మొత్తాన్ని ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చేందుకు యత్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాలుష్య సమస్య నుంచి ప్రజలను రక్షించి, ప్రజలకు ఆరోగ్యమైన జీవన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. కాలుష్య రహిత కార్యక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నది. గ్రామీణ స్వచ్ఛ భారత్ మొదటి దశలో 88,416 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం దేశస్థాయిలో గుర్తింపు పొందింది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రతికొత్తింట్లోనూ మరుగుదొడ్డి సౌకర్యం ఉండేలా చూస్తున్నది.
ఘన, పొడి వ్యర్థాల నిర్వహణ..
ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 22 మండలాల్లోని 479 గ్రామ పంచాయతీలు షెడ్లు నిర్మించాయి. వ్యర్థాలను సేకరించేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ కంపోస్టింగ్ జరుగుతున్నది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో అయిదంచెల వ్యవస్థ అమలవుతున్నది. పొడి వ్యర్థాలను సురక్షితంగా తొలగించేందుకు గ్రామ పంచాయతీలు స్థానిక స్క్రాప్ డీలర్లతో కలిసి పనిచేస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ సేవలను అందిస్తున్న సంస్థలతో జిల్లా యంత్రాంగం అవగాహన కుదుర్చుకుంది. ఐటీసీ ఇప్పటికే స్థానిక పట్టణ ప్రాంతాల సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచలలో 4 డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాల శుద్ధి జరుగుతున్నది. తమ సమీపంలో ఉన్న డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లకు తమ వ్యర్థాలను తరలించాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాష్-ఐ సంస్థ సహకారంతో వ్యర్థాల ప్రామాణీకరణ, వర్గీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. స్థానిక పట్టణ సంస్థల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో డీఆర్‌సీసీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొడి వ్యర్థాలను విభజించి వాటిని తరలించే ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నది. సమస్యలను అధిగమించేందుకు జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో అధికారులకు, సిబ్బందికి సామర్థ్య-నిర్మాణ సదస్సులను వాష్-ఐ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం 168 గ్రామ పంచాయతీలలో వ్యర్థాలను అవి వెలువడుతున్న ప్రాంతాల్లోనే విభజిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇది 70 శాతం వరకు అమలవుతున్నది. అన్ని పంచాయతీల్లోనూ 100 శాతం వ్యర్థాల విభజన జరిగేలా వారానికోసారి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అడుగులు...
ప్లాస్టిక్ వాడక రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధిస్తూ 5 సెప్టెంబర్ 2019న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడ్డతో చేసిన సంచులను ప్రత్యామ్నాయంగా జిల్లా యంత్రాంగం అమల్లోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా కారక్రమాలు చేపడుతున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడానికి స్వయం సహాయక బృందాల సభ్యుల సహకారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ సంచులను సేకరించడానికి, వేరు చేయడానికి, పార వేసేందుకు ప్రజల సహకారం పొందేందుకు ప్రయత్నించి విజయం సాధించారు.
ద్రవ వ్యర్థాల నిర్వహణ:
ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశానికి గ్రామ పంచాయతీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రంగు మారిన నీటిని కమ్యూనిటీ సోక్ పిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వ్యర్థ జలాలను సమర్థవంతంగా శుద్ధి చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల రీఛార్జ్ జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి మండలంలోనూ కనీసం ఆరు గ్రామ పంచాయతీలు ఎల్‌డబ్ల్యూఎం కార్యకలాపాలతో పనిచేసే మిషన్ మోడల్లో సోక్ పిట్లు, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇప్పటి వరకు 3279 వ్యక్తిగత మరుగుదొడ్లు , 1,331 సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు.
ఓడిఎఫ్ ప్లస్ విజయాలు
ఇప్పటివరకు జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్-ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. అన్ని గృహాలు, సంస్థలకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడం, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను కల్పించి వాటిని సక్రమంగా నిర్వహించడం లాంటి అంశాలకు దీనిలో ప్రాధాన్యత కల్పిస్తారు. ఓడీఎఫ్-ప్లస్ కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించే అంశంలో ఐఈసి కార్యక్రమాల నిర్వహణ, ప్రముఖ ప్రాంతాలలో సందేశాలను ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. 100 శాతం ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు సౌకర్యాలను కల్పించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు పొందాలని అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం గ్రామ పంచాయతీలు మాత్రమే కాకుండా మొత్తం జిల్లా ఓడిఎఫ్ ప్లస్ గుర్తింపు పొందేలా చూసేందుకు మల వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. దీనిలో భాగంగా నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాలుగు శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవి సెప్టిక్ ట్యాంక్‌లతో కూడిన గ్రామీణ హెచ్హెచ్ల అవసరాలను తీరుస్తూ మల వ్యర్థాలను సురక్షితంగా తొలగిస్తుంది.