Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా
- జీఓ నెం.22 గెజిట్, ఇతర డిమాండ్ల కోసం ఆందోళనలు యథాతధం : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60 ప్రకారం వేతనాలను పెంచేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపిందనీ, ఇతర డిమాండ్లనూ పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో శనివారం నుంచి తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని సింగరేని కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు గుత్తుల సత్యనారాయణ, కడారి సునీల్, బి. మధు, ఎ. వెంకన్న, ఎస్కె. యాకూబ్షావలి, ఎమ్డీ. రాసుద్దీన్, ఎ. కృష్ణ, కె. నాగభూషణం, ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర కమిషనర్(సెంట్రల్) కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్(సెంట్రల్) పి.లక్ష్మణ్ సమక్షంలో సింగరేణి యాజమాన్య బృంద సభ్యులు జనరల్ మేనేజర్ (పర్సనల్), ఐఆర్‌అండ్‌పీఎం ఎ. ఆనందరావు, డీజీఎం (పర్సనల్, ఐఆర్) కవితా నాయుడు, డీవైపీఎం సిహెచ్. అశోక్ జేఏసీ నేతలతో చర్చలు జరిపారని తెలిపారు. ఆ చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, తదితర 18 డిమాండ్లపై చర్చ జరిగిందనీ, పలు అంశాలపై వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. జీఓ నెం.60 ప్రకారం వేతనాల పెంపుదలకు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందనీ, నిర్ధిష్ట అధ్యయనం కోసం యాజమాన్యానికి లేబర్ కమిషనర్ రెండు నెలల గడువునిచ్చారని వివరించారు. కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు, పర్మినెంట్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా రూ.15 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ కవరేజితో రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఇప్పటికే మైన్ ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియాలో చెల్లిస్తున్న విధంగా రూ.15 లక్షలు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు సానుకూలంగా స్పందించిందని తెలిపారు. బోనస్, ఈఎస్ఐ, కేటగిరీలను అప్‌గ్రేడ్ చేయడం, కన్వేయన్స్ డ్రైవర్లకు ఔట్ స్టేషన్ డీఎ పెంచడం, పీఎంఈ ఉచితంగా చేయడం, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులకు యూనిఫామ్‌ను ఉచితంగా ఇవ్వటం, ఓబిలలో 8 గంటల పని, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని అమలు, తదితర డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. సీఎంపీఎఫ్ అమలుకాని విభాగాలకు దాన్ని అమలు చేసేందుకు ఒక కమిటీని నియమించి పరిష్కరిస్తామంటూ హామీనిచ్చారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ ప్రతినెలా ఏడో తేదీలోపు వేతనాలు చెల్లించాలని, పే స్లిప్స్ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. తదుపరి చర్చలు ఏప్రిల్ 19న జరుగుతాయని తెలిపారు. ఈ క్రమంలో సమ్మె మాత్రమే వాయిదా వేశామనీ, డిమాండ్ల పరిష్కారం కోసం ఇతర రూపాల్లో ఆందోళనలు జరుగుతాయని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.