Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకుల టీచర్లకు పీఆర్సీ అమలులో జాప్యం
- నిరసనగా 19న హైదరాబాద్‌లో మహాధర్నా
- సీఎస్, సంక్షేమ శాఖలు, సొసైటీ కార్యదర్శులకు టీఎస్‌యూటీఎఫ్ నోటీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ గతేడాది జులై నుంచి వేతనాల పెంపు అమల్లోకి వచ్చింది. ఆగస్టు నుంచి కొత్త జీతాలను పొందుతున్నారు. కానీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రం ఇంకా పాత జీతాలే తీసుకుంటున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గతేడాది జూన్‌లో పీఆర్సీ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. గురుకుల సొసైటీల్లో ప్రత్యేక ఉత్తర్వుల విడుదలలో జాప్యం జరుగుతున్నది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో మాత్రమే గతేడాది అక్టోబర్ నుంచి కొత్త వేతనాలు అమలవుతున్నాయి. వారికీ జూన్ నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదు. బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు సంబంధిత గురుకుల విద్యాసంస్థల సిబ్బందికి పీఆర్సీ అమలుకు అక్టోబర్‌లోనే అనుమతి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆర్థిక శాఖ మౌఖిక ఆదేశాల మేరకు కొత్త వేతనాలు అమలు చేయకుండా నిలిపివేశారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పీఆర్సీ అమలుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇంకా ఇవ్వనేలేదు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సిబ్బంది వేతన స్కేళ్లు ఇతర గురుకులాల సిబ్బంది కంటే ఒక స్టేజీ అదనంగా ఉన్నాయి. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకంటే గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు అదనపు వేతన స్కేళ్లను గతంలో నిర్ణయించారు. అయితే ఇతర సొసైటీల్లోనూ అదే రకంగా అదనపు (ప్యారిటీ స్కేల్స్) వేతనాలను నిర్ణయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. గిరిజన సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు పొందుతున్న వేతన స్కేళ్ళనూ తగ్గించాలని ఆర్థిక శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ కారణంగానే అన్ని సొసైటీల్లో నూతన వేతనాలను అమలు జరపకుండా నిలిపివేయాలని ఆర్థిక శాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదు
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంబంధిత సంక్షేమ శాఖల కార్యదర్శులకు, ఆర్థిక శాఖ అధికారులకు పలుమార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ అనుమతి ఉత్తర్వుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నా కొత్త వేతనాలు అమలు కాకపోవడంతో ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసహనం నెలకొన్నది. వారి ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి, అన్ని గురుకుల విద్యాలయాల సంస్థల సిబ్బందికి కొత్త వేతనాలను వెంటనే అమలు చేయాలనీ, బకాయిలనూ చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 19న రాష్ట్రస్థాయిలో 'గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా'ను హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో నిర్వహించనున్నట్టు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సంబంధిత సంక్షేమ శాఖలు, సొసైటీల కార్యదర్శులకు ధర్నా నోటీసులు అందజేశామని పేర్కొన్నారు.