Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
- సీడీపీవో ఆఫీస్‌కు తాళం
నవతెలంగాణ-కంఠేశ్వర్
అంగన్వాడీ కేంద్రాల అద్దెను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం అంగన్వాడీ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయానికి తరలివచ్చి తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 5 గంటలపాటు ప్రాజెక్ట్ అధికారులను బయటే నిలబెట్టి నిలదీశారు. పీడీ వెంటనే వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ఎంతసేపటికీ పీడీ స్పందించకపోవడంతో శుక్రవారం సైతం ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్‌బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.స్వర్ణ మాట్లాడారు. సంవత్సర కాలంగా సెంటర్ అద్దెలు రాకపోవడంతో ఇంటి యజమానులు అంగన్వాడీ టీచర్లను సూటిపోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. కొంత మంది ఇంటి యజమానులు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేస్తున్నారని, అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వాణి, సందీప, రాజసులోచన, లలిత, సరిత, హేమావతి, సునీత, జరీనా, నసీం, పెద్దఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.